ఎగ్జిబిషన్లకు, ఎమ్యూజ్ మెంట్ పార్క్ లకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సెల్ఫీ జోన్ ఉంటుంది. ప్రముఖుల బొమ్మలు, జంతువుల ఆకారాలతో పర్యాటకులు సెల్ఫీలు దిగుతుంటారు, వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. అయితే ఇలాంటి సెల్ఫీ సరదా ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రాణం పోలేదు కానీ, పోయినంత పనైంది. ఆ ప్రమాదంలో చేయి, కాలు, నుజ్జు నుజ్జయ్యాయి. మొసలి నోట్లో తల ఇరుక్కుపోవడంతో తన చావు ఖాయం అనుకున్నాడు ఆ వ్యక్తి, చివరకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిపాలయ్యాడు.
A tourist in the Philippines was mauled by a crocodile after mistaking it for a statue.
The 29-year-old climbed into the enclosure to take selfies before being attacked.
He suffered serious injuries but survived.#Philippines #CrocodileAttack pic.twitter.com/wQs6VSyh3v
— BPI News (@BPIOrgNews) April 29, 2025
అసలేమైంది..?
ఫిలిప్పీన్స్ లోని జాంబోంగా సిబుగే లో మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. మాంగ్రూవ్ పార్క్ గా దాన్ని అభివృద్ధి చేశారు. అక్కడికి పర్యాటకులు విరివిగా వస్తుంటారు. మాంగ్రూవ్ పార్క్ లో మొసళ్ల మడుగు ప్రసిద్ధి. అక్కడకు వచ్చిన పర్యాటకులంతా ఆ మొసళ్ల మడుగు చూసి ఆశ్చర్యపోతుంటారు. పెద్ద పెద్ద మొసళ్లు అక్కడ ఉంటాయి. వాటికి దూరంగా నిలబడి ఫొటోలు, సెల్ఫీలు కూడా తీసుకుంటుంటారు. అయితే ఒక వ్యక్తి మొసళ్ల మడుగు వద్దకు వచ్చి తికమకపడ్డాడు. నీటిలో ఉన్న మొసలి కదలకుండా ఉండటంతో అది బొమ్మ అనుకున్నాడు. కాసేపు దాని వద్దే నిలబడ్డాడు. మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. మొసలికి ముద్దు పెడుతూ సెల్ఫీ తీసుకోబోయే సరికి అతడు షాకయ్యాడు. అది బొమ్మ కాదు, నిజం మొసలే. అంత దగ్గరగా మనిషి వస్తే అది ఊరికే వదిలిపెడుతుందా. ముందు చేయి నోట కరుచుకుంది, ఆ తర్వాత తొడభాగాన్ని కొరికింది. ఒక జంతువుని మొసలి నోట కరుచుకుంటే ఎలా చేస్తుందో అలాగే చేసింది. దాన్ని చిత్రవధ చేసి ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఆ తర్వాత దాన్ని నమిలి తినేస్తుంది. సదరు సెల్ఫీ సరదా ఉన్న వ్యక్తిని కూడా మొసలి ఇలాగే ముక్కలు ముక్కలు చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడి చేయి, కాలు నుజ్జు నుజ్జయ్యాయి. దాదాపు అరగంట సేపు అతడు మొసలితో పోరాడాడు. చివరకు మిగతా పర్యాటకులు అతడికి సాయం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
అది 15 అడుగుల ఆడమొసలి. దాని పేరు లాలే. మొసళ్లలో కొన్ని బద్ధకంగా ఉంటాయి. అస్సలు కదలిక లేకుండా గంటల తరబడి అక్కడే ఉండిపోతాయి. లాలే కూడా అలాంటిదే. నీటి మడుగులో కూడా అది బద్ధకంగా కదలకుండా ఉంది. అందరూ దాన్ని చూసి వెళ్తుంటే, ఒక్కడు మాత్రం దాని దగ్గరకు వచ్చి నోట చిక్కాడు. మొసలి బొమ్మ అనుకుని దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకోవాలనుకుని, చివరకు ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు.
మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. నీటిలో ఉంటే అది ఏనుగుని కూడా బలంగా లాగేయగలదు. ఏనుగుకంటే నీటిలో ఉన్న మొసలికి శక్తి ఎక్కువ. అయితే అలాంటి మొసలి చేతిలో కూడా చిక్కి ప్రాణాలతో బయటపడటం మామూలు విషయం కాదు. భూమి మీద నూకలున్నాయి కాబట్టి అతడు మొసలి చేతిలో చిక్కినా బయటపడ్డాడు. కానీ చేయి, కాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ గాయాలతో ఆస్పత్రి బెడ్ పై ఉన్న అతనికి ఆ సెల్ఫీ ఓ పీడకలగా మారిపోయింది.