Life After Death : చావు, పుట్టుకలు ఎవరి చేతిలోనూ ఉండవు. చనిపోయాక ఏమవుతుంది? ఎక్కడికి వెళతాం? ఆ స్థితి ఎలా ఉంటుంది? అనేది అంతులేని ప్రశ్నలు. వాటికి జవాబులు ఉండవు. డాక్టర్లు చెప్పలేరు. ఆధ్యాత్మిక వేత్తలు మాత్రం తమదైన శైలిలో వివరిస్తారు కానీ వాటిని సైన్స్ ఒప్పుకోదు. లేటెస్ట్‌గా ఓ మహిళ సుమారు 24 నిమిషాల పాటు మరణించింది. ఆ తర్వాత తిరిగి ప్రాణాలతో ఉంది. ఆ గ్యాప్‌లో ఏమైంది? ఆ స్థితి ఎలా ఉంది? అనేది ఆమెనే వివరించింది. ఆ పుస్తకం ఇప్పుడో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరామె? అసలేం జరిగింది?
24 నిమిషాల పాటు మరణం
టెస్సా రొమెరో.. స్పెయిన్‌కు చెందిన 50 ఏళ్ల జర్నలిస్ట్ అండ్ సోషియాలజిస్ట్. ఒకరోజు ఆమె తన కూతుళ్లను స్కూల్‌లో దించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. స్పాట్ డెడ్. అయితే, 24 నిమిషాల పాటు మాత్రమే ఆమె క్లినికల్‌గా మరణించారు. ఆ తర్వాత మళ్లీ బతికారు. ఇదే ఈ కేసులో ట్విస్ట్. మరణం తర్వాత ఆ 24 నిమిషాల్లో ఏం జరిగిందనేది తను రాసిన “24 మినిట్స్ ఆన్ ది అదర్ సైడ్” పుస్తకంలో వివరించారు.
గాల్లో తేలినట్టుందే..
ఆ సమయంలో ఆమె తన శరీరం నుంచి విడిపోయారట. పైకి గాల్లో తేలియాడుతూ.. కింద ఉన్న తన డెడ్‌బాడీని చూసి ఆశ్చర్యపోయారట. తన చుట్టూ ఉన్న దృశ్యాలను పై నుంచి చూశారట. “నేను చనిపోయినట్లు తెలియలేదు. నేను సజీవంగా, చైతన్యంతో ఉన్నాను, కానీ ఎవరూ నన్ను చూడలేదు” అని తప పుస్తకంలో రాసుకొచ్చారామె. నొప్పి తెలీలేదు.. సమయం తెలీలేదు.. ఒక ప్రశాంతమైన ప్రపంచంలోకి ప్రవేశించినట్టుగా తెలిపారు. ఆ అనుభవం తన జీవితాన్ని సమూలంగా మార్చేసిందని.. మరణం పట్ల భయాన్ని తొలగించిందని చెప్పారు. ఒక ప్రశాంతమైన మరణానంతర జీవితంపై నమ్మకాన్ని కలిగించిందని.. మరణం అనేది కేవలం నిశ్శబ్దం లేదా శూన్యం కాదని.. ఇది ఒక అద్భుతమైన అనుభవమని ఆమె నమ్ముతున్నారు. మరణం ఒక ముగింపు కాదు.. ఒక కొత్త ప్రారంభం అని చెబుతున్నారు.
ఇప్పటికీ మిస్టరీనే..
ఈ సంఘటనకు ముందు టెస్సా ఒక వివరించలేని అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ సమస్య ఏంటో వైద్యులు సైతం చెప్పలేకపోయారు. క్లినికల్ టెస్టుల్లోనూ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవలేదు. కొందరు వైద్యులు ఆమె భావోద్వేగ ఒత్తిడి వల్ల శారీరక సమస్య వచ్చిందని భావించారు. అయితే, 24 నిమిషాల పాటు మరణించిన ఆ అనుభవం తర్వాత.. ఆమె శారీరకంగా, మానసిక రికవరీ అయ్యారు. టెస్సా ఇప్పుడు ప్రేమ, దయ, మానవ సంబంధాల శక్తిని ప్రచారం చేస్తూ.. మరింత ఆసక్తిగా జీవిస్తున్నారు.