కౌలాలంపూర్‌కు చెందిన ఈ మహిళ పేరును బయటకు రానీయకుండా రహస్యంగా ఉంచారు. ఆమెకు ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతను అమెరికన్ వ్యాపారవేత్తగా చెప్పుకున్నాడు. సింగపూర్లో వైద్య పరికరాల సేకరణ చేస్తున్నట్టు చెప్పాడు. ఒక నెలపాటు ఇద్దరూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే అతను తాను మలేషియాకు వెళ్లాలనుకుంటున్నానని, అయితే వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకుంటున్నాయని చెప్పాడు. అతని ప్రేమలో మునిగిపోయిన ఆ మహిళ లక్ష రూపాయలు తొలిసారిగా అతని అకౌంట్ కు బదిలీ చేసింది.
అలా ప్రేమికుడు డబ్బు కోసం అడిగినప్పుడల్లా ఎంతో కొంత వేస్తూనే ఉంది. అలా ఇప్పటివరకు 306 సార్లు ఆ ప్రేమికుడికి డబ్బును ట్రాన్స్ ఫర్ చేసింది. అతడు యాబై వేర్వేరు బ్యాంకు ఖాతాలను ఉపయోగించాడు. ఇప్పటివరకు ఆ డబ్బు విలువ నాలుగు కోట్ల రూపాయలు ఉన్నట్టు పోలీసులు తేల్చారు.
ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తి ఆమెను పదే పదే డబ్బు పంపమని అడిగేవాడు. అలాగే కుటుంబం, స్నేహితుల నుండి కూడా అప్పులు తీసుకున్నానని చెప్పేవాడు. తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని అనేవాడు. అతని తీయటి గొంతుకు, ప్రేమపూర్వకమైన మాటలకు ఆమె బానిసగా మారిపోయింది. అందుకే ఎలాంటి అనుమానం రాకుండా డబ్బులు పంపుతూనే ఉంది. కేవలం వాయిస్ కాల్స్ ద్వారానే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు. నేరుగా వాళ్ళిద్దరూ కలిసింది లేదు.. అయినా ఆమె ఆ ప్రేమ మత్తులో మునిగిపోయింది.