Viral video of railway: ఒకప్పుడు రైలు రాగానే జనాలు పక్కకు తొలగేవాళ్లు. కానీ ఇప్పుడు రైలు రావడం తెలిసీ, అదే ట్రాక్‌పై నిద్రపోయే ధైర్యం కొంతమందికి వస్తోంది. నలిగిపోయే ప్రమాదం ఉన్నా, ఫోన్‌లో రికార్డు చేసి, సోషల్ మీడియాలో హీరోగా మారాలని చూడటం చూసి ఇది పోయే కాలమా? లేక బుద్ధి లేని తెగింపు కాలమా? అన్నంత స్థాయికి వెళుతోంది ఈ వ్యవహారం.
తాజాగా ఓ యువకుడు రైలు పట్టాల మధ్య పడుకున్నాడు. పైగా అది ట్రైన్ వచ్చే సమయం. అతని మిత్రులు వీడియో తీస్తూ పక్కనే కూర్చున్నారు. శబ్దం చేస్తూ వస్తున్న రైలు అతడి మీద నుంచి వెళ్లిపోయింది. అతని మీద గీత కూడా పడలేదేమో, కానీ ఇది సాహసం కాదు.. పూర్తిగా పిచ్చి అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కటే కామెంట్.. లైక్స్ కోసం లైఫ్‌నే లాస్ట్ చేసుకుందామని అనుకున్నాడేమో అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
అయితే ఇది ఒక్కటే కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పట్లో రైల్వే పోలీసులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు, 2023లో ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు రైలు ట్రాక్‌పై డాన్స్ చేస్తూ వీడియో చేశాడు. వెంటనే అతన్ని గుర్తించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అరెస్ట్ చేసి, రైల్వే యాక్ట్ 147, 145 సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు. రెండు రోజుల పాటు రిమాండ్‌లో ఉంచారు.
ఇక మరో సంఘటనను చూస్తే, ముంబైలో ఓ యువకుడు రైలు వస్తున్నప్పుడు ట్రాక్ మీద సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే టైమింగ్ తప్పిపోయి గాయపడ్డాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో చూసిన పోలీసులు సుమారు మూడు రోజుల తర్వాత అతడిని గుర్తించి కేసు పెట్టారు. ఆ కేసు తర్వాత ముంబై రైల్వే పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్టేషన్ల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టి జీవితం రీల్ కాదు.. తిరిగి రానిదని చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.
ఇంతకీ ఇలాంటి వీడియోలు వైరల్ కావడానికి కారణం ఏంటంటే.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఈ వీడియోల్ని పెద్దగా కంట్రోల్ చేయడం లేదని చెప్పవచ్చు. ఫాలోవర్స్, లైక్స్, షేర్‌లు రావడం చూసి మరికొందరు యువత వీటిని అనుకరిస్తున్నారు. కానీ ఒక చిన్న తప్పిదం ప్రాణాలను బలిగొంటుందనే నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో తాజా ఘటనపై కూడా రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి, అతనిపై చర్యలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. చట్టపరంగా చూస్తే.. రైలు ట్రాక్‌లో అనుమతి లేకుండా ప్రవేశించడం కూడా నేరమే. అది మరో వ్యక్తి ప్రాణాలకైనా ప్రమాదం అయిందంటే, మరింత తీవ్రంగా పరిగణిస్తారు.
ఇక చట్టపరంగా కాకపోయినా, సామాజికంగా చెప్పాలంటే.. ఇలాంటి చర్యలు చూసి ఇంకొంత మంది యువతను ప్రేరేపించే అవకాశముంది. ముఖ్యంగా స్కూల్, కాలేజీ వయసులో ఉన్న యువతరంలో ఇది లైక్స్ పిచ్చిగా పెరిగిపోతోంది. అందుకే ప్రతి తల్లి, తండ్రి ఇలా చేస్తే ఏమవుతుందో పిల్లలకు చెప్పాలి. సోషల్ మీడియా ఫేమ్ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించాలి.
ఒకవేళ తల్లిదండ్రులు గమనించకపోతే, పక్కవాళ్లైనా అలాంటి వీడియోలు చూసినప్పుడు రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే అది ఏ ఒక్కరి జీవితం కాదు.. సమాజపు భద్రత ప్రశ్నకు గురవుతుంది. రైలు డ్రైవర్లు కూడా అలాంటి ఘటనల వల్ల మానసికంగా బాధ పడతారు. ఒక్కసారి ఏదైనా తప్పు జరిగితే, ప్రాణం పోవడం కాదు జీవితాలే చీకట్లోకి వెళ్లిపోతాయి. ఫేమ్ రావొచ్చు, వైరల్ కావొచ్చు. కానీ జీవితానికి వస్తే మాత్రం ఇంకో ఛాన్స్ ఉండదు. ట్రాక్‌పై నిద్రపోయిన అతడు బ్రతికిపోయాడు. అది అదృష్టం. కానీ అదే పని ఇంకొకరు చేస్తే, అదే రీల్ చివరిది కావచ్చు.
WTH! He's lying in the middle of the train tracks to make a reel. why are he and people like him playing with their own life? I've seen many videos like this. pic.twitter.com/c8oKJtIe0l
— Deadly Kalesh (@Deadlykalesh) July 22, 2025