Muslim Woman Marry Hindu Boy| ప్రేమకు ఏదీ అడ్డు కాదని నిరూపించింది ఓ ముస్లిం యువతి. తను ప్రేమించిన మైనర్ అబ్బాయిని పెళ్లిచేసుకోవడానికి ఆమె తన మతాన్ని మార్చుకుంది. తన ప్రియుడు హిందువు కావడంతో తను కూడా హిందూ మతం స్వీకరించింది. అయితే ఆమె వయసు కన్నా ఆ ప్రియుడి 9 ఏళ్లు చిన్నవాడు కావడంతో పలువురు ఆమె ప్రేమను విమర్శిస్తున్నారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ జిల్లాలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నం అనే 27 ఏళ్ల యువతికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు మొదటి భర్త నుంచి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి జరిగిన 5 ఏళ్ల తరువాత భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వికాలాంగుడయ్యాడు. దీంతో ఆమె మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆ తరువాత షబ్నం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో కూడా ఆమెకు సఖ్యత కుదరక గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో ఆమెకు 12 తరగతి (ఇంటర్‌మీడియట్) చదువుకునే శివాజీ (17) అనే కుర్రాడు పరిచయమయ్యాడు. అతని అందం, యవ్వనం చూసి మోహించిన షబ్నం అతడినే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది. అందుకే అతడిని ప్రేమించి.. తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే తరుచూ సినిమాలకు, షికార్లకు తిరుగుతుండడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. వారి ప్రేమను అంగీకరించలేదు. అయితే షబ్నం ఒక వివాహిత. దీంతో వారిద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని పలువురు విమర్శించారు. అందుకే షబ్నం తన రెండో భర్తతో గొడవ పడి అతనితో విడాకులు తీసుకుంది.
Also Read: ‘ఎక్స్‌కూజ్ మీ’ అన్నందుకు మహిళలను చితకబాదిన జనం.. మాతృభాషలో మాట్లాడకపోతే అక్కడ అంతే
ఆ తరువాత తన ప్రియుడు శివాజీని పెళ్లి చేసుకునేందుకు తిరిగి వచ్చింది. కానీ అతని తల్లిదండ్రులు తాము హిందువులమనే విషయాన్ని ఆమెకు గుర్తు చేశారు. దీంతో షబ్నం తన మతం మార్చుకుంటానని చెప్పి.. హిందూ మతంలోకి మారింది. తన పేరు షబ్నం నుంచి శివానిగా మార్చుకుంది.అయినా శివాజీ తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో శివాజీతో కలిసి శివాని స్థానికంగా ఉన్న సైదాన్ వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శివాజీ కుటంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు శివాజీ తల్లిదండ్రులు తమ కొడుకు ఒక మైనర్ అని ఇద్దరు భర్తలను వదిలేసిన ముగ్గురు పిల్లల తల్లితో వివాహం చేసుకుంటానంటే ఎలా అంగీకరించేది అని ప్రశ్నించారు. పైగా షబ్నం ఒక మోసగత్తె అని ఆరోపించారు. దీంతో పోలీసులు ఈ కేసులో షబ్నం గురించి విచారణ చేస్తున్నారు.
అయితే షబ్నం మాత్రం మీడియా ముందుకొచ్చి తమ ప్రేమ గురించి మాట్లాడింది. తన పేరు ఇక శివాని అని.. హిందూ మతం స్వీకరించానని (Hinduism convert) శివాజీతో తన జీవితమని చెప్పింది. తమ వ్యక్తిగత జీవితానికి, సంతోషానికి ఎవరూ భంగం కలిగించవద్దని కోరింది.