Upasana: మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఈమె.. అంతే ఉన్నతంగా ఆలోచిస్తూ ఎంతోమందికి అండగా.. ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా కరోనా వంటి కష్ట కాలంలో కూడా ప్రజలకు అండగా నిలిచి, ఆరోగ్య పరమైన సలహాలు ఇస్తూ.. ప్రజలను ఆరోగ్యవంతులుగా మార్చారు. అంతేకాదు ఏదైనా కష్ట సమయంలో ఆరోగ్యం బాగోలేక అత్యవసర పరిస్థితుల్లో వున్న ఎంతోమందికి ఉచితంగా వైద్యం అందించిన గొప్ప చరిత్ర ఆమెది.. ఒకవైపు కుటుంబం మరొకవైపు వ్యక్తిగత జీవితం.. వ్యాపార సామ్రాజ్యాలను చక్కగా నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తొలిసారి వైవాహిక బంధం గురించి ఓపెన్ అయ్యారు.
ఆ లక్షణాలన్నీ చరణ్ లో ఉన్నాయి- ఉపాసన..
“వివాహం అనేది పూల పాన్పు కాదు.. ఇద్దరి మధ్య సరైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది. నాకు, చరణ్ కి మధ్య అది చాలా చక్కగా పనిచేస్తుంది . మేము బంధాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము” అంటూ తెలిపింది ఉపాసన. ఇక వైవాహిక బంధాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వమని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడగగా.. “మేమిద్దరం సమస్థాయిల నుండి వచ్చాము. పెళ్లికి ముందే మాకు అవగాహన ఉంది. మనిషి విలువ, ఆరోగ్యకరమైన బంధాలను కొనసాగించడం, నమ్మకం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థిరంగా ఎదుర్కోగలిగే లక్షణం చరణ్లో బాగా ఉంది .అవన్నీ ఆయనకు తన తండ్రి నుంచి వచ్చాయి. అలాంటి వ్యక్తులు మహిళలు ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంతో సహకరిస్తారు. అందుకే చరణ్ నాతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ప్రతి దశలో కూడా నాకు తోడుగా నిలిచాడు. అలాంటి వ్యక్తితో కలిసి ఉండటమే నా ఈ విజయ రహస్యం ” అంటూ తన భర్త సపోర్టు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఉపాసన.
ప్రతి దాంపత్య జీవితంలో డేట్ నైట్ తప్పనిసరి – ఉపాసన
వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ..” మా కుటుంబం మొత్తం మా చుట్టూనే ఉంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మాకు మద్దతుగా నిలుస్తూ ఉంటారు. అది నా వైపు నుంచైనా. లేక చరణ్ నుంచైనా.. మాకెన్ని షెడ్యూల్స్ ఉన్నా సరే వాటిని మేము సమన్వయం చేసుకుంటూ మాకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటాము. వారంలో ఒక్కరోజైనా ‘డేట్ నైట్’ ఉండాలని మా అమ్మ చెబుతుంది. ఇది చాలా అవసరం. వీలైనన్ని సార్లు అది సహకారం అయ్యేలా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా డేట్ నైట్ లో ఇంటివద్దే ఉంటూ.. ఫోన్లు టీవీలు దూరం పెట్టేస్తాము. నేను, చరణ్ దీన్ని నెమ్మదిగా వ్యవస్థీకృతం చేయాలని అనుకుంటున్నాము. సమస్యలు ఏదైనా సరే కలిసి కూర్చొని మాట్లాడుకుంటాము. అలా చేస్తేనే బంధం బలపడుతుంది. వివాహ బంధంలో ప్రతి ఒక్కరు వీటిని ఆమోదించాలి. రోజు వాటిపై కసరత్తు చేయాలి. ప్రతి వివాహ బంధంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ మీ లక్ష్యాలను మీకు తెలిసినంత కాలం ఒకరికొకరు గౌరవించుకోవాలి. అప్పుడే వివాహ బంధం సౌకర్యవంతంగా ఉంటుంది” అంటూ ఉపాసన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఉపాసన చెప్పిన ఈ మాటలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కూడా చెప్పవచ్చు.