Viral Video : ఐ లవ్ మై ఇండియా. మేరా హిందుస్తాన్ మహాన్. ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. మాతృదేశం మీద మనకు ప్రేమ ఉండటం ప్రత్యేకమేమీ కాకపోవచ్చు. కానీ, విదేశీయులు సైతం మన దేశాన్ని ప్రేమిస్తున్నారంటే ఏదో విశేషం ఉందనేగా. భారతదేశం దేవ భూమి. పుణ్య భూమి. ఆసేతు హిమాచలం అడుగడుగునా దైవత్వమే. ఇక్కడి నదులు పవిత్రం. ఇక్కడి గాలి స్వచ్ఛం. ఇక్కడి నేల అద్భుతం. చెట్లను పూజించే సంస్కృతి మనది. పాములను, పక్షులను, జంతువులను ఆరాధించే గొప్పతనం మనది. రాళ్లలో దేవుళ్లను ఆవాహనం చేసే సామర్థ్యం మనది. వేదాలు, వేద మంత్రాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యోగా, ఉపవాసాలు.. ఇలాంటివి కేవలం ఇండియా సొంతం. విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, పద్దతుల సమాహారం. వసుదైక కుటుంబం మన విధానం. భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం. అనేకమంది విదేశీయులు సైతం ఈ విషయాన్ని అంగీకరింస్తారు. ఇండియాలో పుట్టి ఉంటే బాగుండేదే అనుకుంటారు. ఇక్కడ జన్మించకపోయినా.. మన దేశానికి తరుచూ వస్తూ.. మన విధానాలను ఆచరిస్తూ.. మన సంస్కృతిని ఫాలో అయ్యే ఫారినర్స్ లక్షల్లోనే ఉంటారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు చాలానే కనిపిస్తాయి.
ఫారినర్స్ ఫిదా..
ప్రపంచం మొత్తం ఒక ఇల్లు అయితే.. అందులో భరతభూమి పూజా గది లాంటిది అంటారు. కొందరు విదేశీయులు మన యోగాకు ఫిదా అవుతారు. మరికొందరు హరే రామ హరే కృష్ణ భక్తులుగా మారారు. హోమాలు కూడా చేసే వారున్నారు. ఇటీవలే అలాంటి ఓ ఫారినర్‌కు పద్మశ్రీ పురష్కారం కూడా ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం. ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లంతా మనదేశం అంటే పడి చస్తారు. ఇక్కడి స్పైసీ ఫుట్ లొట్టలేసుకుంటూ తింటారు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు స్టెప్పులేస్తుంటారు. ఇండియా ఎందులోనూ తగ్గేదేలే.
కూతురుకు ఇండియా అని పేరు..
సౌత్ ఆఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ తెలుసుగా. ఆయనకు కూడా మనదేశం అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే.. తన కూతురుకు ‘ఇండియా’ అని పేరు పెట్టుకునేంత. సేమ్ అలాంటిదే మరో ఉదంతం. క్రిస్ హెమ్స్‌వర్త్, ఎల్సా పటాకీ అనే విదేశీ దంపతులు సైతం తమ కుమార్తెకు ‘ఇండియా రోజ్’ అని పేరు పెట్టి భారత్‌పై తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఆ ఫ్యామిలీ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తోంది. తమ కూతురుకు చిన్నప్పటి నుంచే ఇక్కడి ప్రజలను, విశేషాలను పరిచయం చేయించేందుకు ట్రై చేస్తోంది ఆ జంట. ఆ చిన్నారి, ఆమె తల్లితో మాట్లాడించిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియాను చాలా గొప్పగా కీర్తిస్తోంది ఆ ఫారినర్.
ఇండియా పేరు ఎందుకు పెట్టారంటే..
కూతురుకు ఇండియా అని పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే.. ఆసక్తికర ఆన్సర్ చెప్పారామె. ఇండియా అనేది బ్యూటిఫుల్ నేమ్ అన్నారు. ఆ పేరులోనే ఓ ప్రశాంతత ఉందన్నారు. ఇది అందమైన దేశమని.. ఇది తన హృదయాన్ని తాకిందని అన్నారు. ఇండియాలోని అన్ని అంశాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇక్కడి వైబ్రెంట్ కలర్స్, రిచ్ స్మెల్స్, వైబ్రెంట్ సౌండ్స్ తనను ఫిదా చేశాయని అంటున్నారు. ఇండియా పేరు తనకు కూడా చాలా నచ్చిందని ఆ చిన్నారి సైతం చెప్పింది. ఆ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.