Radha-Krishna: రాధా కృష్ణులు అనగానే మనకి వారి అందమైన ప్రేమ కథ గుర్తుకు వస్తుంది. హిందూ సంప్రదాయంలో శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తి అవతారంగా, ప్రేమ, జ్ఞానం, ఆకర్షణల కలయికగా పూజిస్తారు. కృష్ణుడి జీవితంలో రాధ, రుక్మిణి ఇద్దరు స్త్రీలు ఉన్నారు. రాధ కృష్ణుడికి ప్రేయసి అయితే రుక్మిణి కృష్ణుడి భార్యగా పురాణాలు చెబుతున్నాయి. అయితే, కృష్ణుడితో కలిసి భార్య అయిన రుక్మిణి కంటే రాధనే ఎందుకు ఎక్కువగా పూజిస్తారు అనే ప్రశ్న మనలో ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. అయితే, రుక్మిణి కంటే కూడా రాధకు ఎందుకు భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది అంటే దీనికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భావోద్వేగ కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాధకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
రాధ కేవలం ఒక చారిత్రక లేదా పౌరాణిక పాత్ర మాత్రమే కాదు, ఒక ఆత్మ దైవంతో ఐక్యం అవ్వాలని కోరుకునే ఒక తపనకు చిహ్నం. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో రాధను భక్తికి స్వరూపంగా, దైవిక ఆనందానికి శక్తిగా భావించి పూజిస్తారు. తనకి కృష్ణుడితో ఉన్న బంధం నిస్వార్థ ప్రేమకు ఒక గొప్ప రూపం. భాగవత పురాణం, జయదేవుని గీతగోవిందం వంటి గ్రంథాలు రాధను శ్రీకృష్ణపరమాత్ముని శాశ్వత ప్రేయసిగా, ఆమె ప్రేమను పవిత్రంగా, కల్మషం లేని ఒక నిస్వార్థ ప్రేమగా పురాణాలలో చిత్రీకరించారు.
రుక్మిణీదేవి ద్వారకలో కృష్ణుడి మొదటి భార్యగా, విదర్భ రాజకుమారిగా, లక్ష్మీదేవి అవతారంగా కనిపిస్తుంది. ఆమెకు కృష్ణుడితో ఉన్న సంబంధం ధర్మం, భార్యాభర్తల బంధంలోని భక్తిని చూపిస్తుంది. వీరిద్దరి భార్యాభర్తల సంబంధం ఎంత ఆధ్యాత్మికమైనా రాధ ప్రేమలో ఉన్న బలమైన భావోద్వేగ శక్తి ఈ బంధంలో లేదనే చెప్పాలి.
రాధా-కృష్ణుల ప్రేమ
రాధా-కృష్ణుల ప్రేమకథ భారతీయ సాహిత్యం, సంగీతం, కళల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. బృందావనంలో జరిగే వారి లీలలు, ప్రేమలోని విరహం సమాగమం భక్తులను మురిపించి భక్తిలో తేలిపోయేలా చేస్తాయి. రాసలీలల్లో కృష్ణుడు రాధా, గోపికలతో కలిసి చేసే నృత్యం ఆత్మధైవంతో కలిసిపోయే ఆనందాన్ని సూచిస్తుంది. ఈ ప్రేమకథ రాధను భక్తులకు మరింత దగ్గర చేసింది.
రుక్మిణీదేవికి సంబంధించిన కథలు ద్వారకలో కృష్ణుడు రాజుగా రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో జరిగినవిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కథల ప్రాముఖ్యత ఎంత ఉన్నా గానీ రాధ కథల్లోని కవితాత్మకత, భావోద్వేగ లోటు వీటిలో ఉండదు కాబట్టి రాధ ప్రేమ దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది.
భావోద్వేగ బంధం
కృష్ణుడితో రాధకు ఉన్న సంబంధం, భక్తి, ఆరాధనతో కలిగి ఉంది. ఈ బంధం భక్తులకు ఆ శ్రీకృష్ణపరమాత్మకు ఉన్న బంధాన్ని సూచిస్తుంది. భక్తులు కృష్ణుడి ప్రేమ, కరుణ కోసం చేసే భజనలు, కీర్తనలలో రాధ పేరు కృష్ణుడితో కలిపి వినిపిస్తుంది. దీని ద్వారా భక్తులకు దేవుడికి ఉన్న బంధం మరింత బలపడుతుందని భక్తుల నమ్మకం. బృందావనం, మథురలోని రాధా-కృష్ణ ఆలయాలు లక్షలాది భక్తులను, సందర్శకులను ఆకర్షిస్తాయి.
రుక్మిణీదేవిని గౌరవిస్తారు. కృష్ణుడిని రాజుగా కొలిచే గుజరాత్‌లోని ద్వారకాధీశ్ వంటి ఆలయాల్లో రుక్మిణీదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ ఆలయంలో ఆమె రాణిగా ధర్మం, నీతిని సూచిస్తుంది. కానీ రాధ ప్రేమలో ఉండే భక్తిని ఇది అందించలేదు.
చారిత్రక, ప్రాంతీయ ప్రభావం
రాధ ఆరాధనకు మధ్యయుగ కవుల ప్రభావం కూడా ఉంది. 16వ శతాబ్దంలో గౌడీయ వైష్ణవ సాంప్రదాయ స్థాపకుడు చైతన్య మహాప్రభు రాధను ఆదర్శ భక్తురాలిగా, చాలా ఉన్నతంగా చిత్రీకరించారు. రాధ ఆరాధన బెంగాల్, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది.
రుక్మిణీదేవి ఆరాధన గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే కృష్ణుడి ద్వారకా జీవితం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. కానీ, ఈ ప్రాంతాల్లోనూ రాధకు ఉన్న ఆకర్షణ రుక్మిణీదేవిని మించిపోతుంది.