Bread Hygiene: ఒక యువతి బ్రెడ్ తయారు చేయడానికి ఉపయోగించే పిండిని చేతులతో కాకుండా, నేరుగా తన కాళ్లతో తొక్కుతూ కలపడం నెట్టింట తీవ్ర దుమారం రేపింది. అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టెను డబుల్ రేట్ పెట్టి కొంటున్న మగాళ్లు అంటూ సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. టేస్ట్ కోసం ఆ యువతి చేసిన ఈ వింత పని ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా తీవ్రమైన చర్చకు, వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో ఒక యువతి బ్రెడ్ తయారీ కోసం పిండిని చేతులతో కాకుండా తన కాళ్లతో తొక్కుతూ కలుపుతోంది. దీనిని ఒక సాంప్రదాయ బేకింగ్ పద్ధతిగా, దీనివల్ల బ్రెడ్‌కు అదనపు ఈస్ట్ ఫ్లేవర్ వస్తుందని కొందరు సమర్థిస్తుండగా, నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే ఆ యువతి ఒక పెద్ద పాత్రలో ఉంచిన బ్రెడ్ పిండిని తన రెండు కాళ్లతో తొక్కుతూ, పదే పదే నలుపుతూ కలిపింది. అయితే, ఇదంతా చూస్తున్న వారికి తీవ్ర అసహ్యం కలిగించినప్పటికీ, ఆమె మాత్రం దీని వెనుక ఒక వింత కారణాన్ని చెప్పుకొచ్చింది. ఇలా కాళ్లతో పిండిని కలపడం అనేది ఒక పురాతన, సాంప్రదాయ బేకింగ్ పద్ధతి అని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, ఇలా చేయడం వల్ల పిండిలో ఒక ప్రత్యేకమైన పులియబెట్టే గుణం, ఒక నట్టి టేస్ట్ వస్తుందని సదరు యువతి వాదించింది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షం కావడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఆహార ప్రియులు ఆ యువతిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆహార పరిశుభ్రతకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సాంప్రదాయం కాదు.. అత్యంత అసహ్యకరమైన, మురికి పని, ఇలాంటి బ్రెడ్ తింటే రోగాలు రావడం ఖాయం, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా? అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.
also read :మెగా హీరో సినిమా సస్పెన్స్..వంద కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరేనా?
సాధారణంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో ద్రాక్ష రసం తీయడానికి, అంటే వైన్ తయారీలో కాళ్లతో తొక్కే పద్ధతి పూర్వం ఉండేది. కానీ, నేరుగా తినే బ్రెడ్ పిండిని ఇలా కాళ్లతో తొక్కడం మాత్రం ఎక్కడా ఆమోదయోగ్యం కాదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కాళ్లకు ఉండే బ్యాక్టీరియా, చెమట ఆహారంలో కలవడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అవుతుంది.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోవడంతో, కేవలం, క్లిక్స్ సంపాదించడానికి ఇటువంటి షాకింగ్ వీడియోలను తీస్తున్నట్టు అర్థమవుతుంది.సాధారణంగా ఫుడ్ వ్లాగింగ్ రంగంలో కొత్త రుచులు, వినూత్న వంటకాలను చూపించడం సాధారణమే అయినా, ఇలా మనుషులు తినే ఆహారాన్ని అపవిత్రం చేస్తూ, కనీస పరిశుభ్రత లేని పద్ధతులను ప్రచారం చేయడం సమాజానికి హానికరమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read :ఒక్క నిమిషం ఆలస్యం.. ముక్కలైన మెడికల్ కలలు! నీట్ రీ-ఎగ్జామ్‌లో గుండెల్ని పిండేసే వీడియో
ఇటువంటి కంటెంట్‌కు ఆదరణ లభించడం వల్లే మరింత మంది ఇటువంటి పిచ్చి ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారని, తద్వారా పబ్లిక్ హెల్త్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికలు కూడా ఇటువంటి అసహ్యకరమైన, ప్రమాదకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించే వీడియోలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటిని నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.