World’s Longest Car: మీరు ఎప్పుడైనా హెలిపాడ్ ఉన్న కారు గురించి విన్నారా? అందులో స్విమ్మింగ్ పూల్, జకూసీ, వాటర్ బెడ్, మినీ గోల్ఫ్ కోర్సు ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఎక్కడో సినిమాలో చూసిన కలలా అనిపిస్తుందా? అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఇలాంటి కారు నిజంగానే ఉంది. పేరు “ది అమెరికన్ డ్రీమ్” – ప్రపంచంలోనే అతి పొడవైన కారు. ఈ కారు చూడటానికి మాత్రమే కాదు, అందులో ఎక్కి ప్రయాణించడానికి కూడా నిజంగా ఓ అనుభవం.
ది అమెరికన్ డ్రీమ్ – ఒక అరుదైన కలను సాకారం చేసిన కారు
ఈ అద్భుతమైన కారును తొలిసారిగా 1986లో జే ఓర్‌బర్గ్ అనే ప్రముఖ కస్టమ్ కార్ డిజైనర్ తయారు చేశాడు. కాలిఫోర్నియాలో జన్మించిన ఆయన, సినిమాల కోసం వింత కార్లను డిజైన్ చేయడంలో పేరు సంపాదించుకున్నాడు. మొదట ఈ కారు పొడవు 60 అడుగులు మాత్రమే ఉండేది. కానీ తరువాత దీన్ని 100 అడుగులు 1.5 అంగుళాలు పొడవుగా మార్చారు. దీంతో ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ప్రపంచంలోనే పొడవైన కారుగా నమోదైంది.
డిజైన్, ఫీచర్లు – భూలోక స్వర్గమే!
* ఈ కారులో 26 చక్రాలు ఉన్నాయి. ముందు, వెనక – రెండూ V8 ఇంజిన్లతో నడుస్తుంది. ఇది ఒక కారు కాదు… ఒక హోటల్ లైంగా, లగ్జరీ ట్రావెలింగ్ మేన్షన్ లా ఉంటుంది.
* ఈ కారులో ఉన్న ఫీచర్లు వింటే ఎవరికైనా నోరెళ్లబెట్టాల్సిందే –
* స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికితోడు డైవింగ్ బోర్డ్ కూడా!
* వాటర్ బెడ్, జకూసీ, స్నానాల టబ్ – ఇవన్నీ కారులోనే ఉన్నాయి. మినీ గోల్ఫ్ కోర్సు కూడా ఉంది.
* ఇంతకీ హైలైట్ ఏంటంటే – ఈ కారుపై హెలిపాడ్ కూడా ఉంది! ఇది దాదాపు 5,000 పౌండ్ల బరువుదాకా తట్టుకోగలదు. అంటే చిన్న హెలికాప్టరును సులభంగా దిగనివ్వగలదు.
అందులో ఎవరెవరు కూర్చోగలరు?
ఈ కారులో 75 మందికిపైగా కూర్చోగల సామర్థ్యం ఉంది. పెళ్లిళ్లు, ప్రైవేట్ పార్టీలు, సెలబ్రిటీల ఈవెంట్స్ కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అందులో కూర్చోవడం అంటే, ఏదైనా రాజప్రాసాదంలో అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది.
ఇంటీరియర్ అంతా ఒక నిడివైన హాల్ లాగా ఉంటుంది. టీవీలు, ఫ్రిడ్జ్, టెలిఫోన్ మొదలైన అన్ని ఆధునిక సదుపాయాలూ అందులో ఉన్నాయి.
ఈ డ్రీమ్, మళ్లీ ఎలా సాధ్యమైంది?
ఆకర్షణీయంగా కనిపించిన ఈ కారు, కొన్ని సంవత్సరాలు వాడకపోవడంతో పాడైపోయింది. దెబ్బతిన్న బాడీ, వంకరైన టైర్లు, రంగు పోయిన ఆభరణాల మధ్య, ఆ కారుకు మళ్లీ జీవం పోసిన వ్యక్తి మైఖేల్ డెజర్. అతను ఫ్లోరిడాలో ఉన్న డెజర్లాండ్ పార్క్ కార్ మ్యూజియం యజమాని. ఈ కారును అతను కొనుగోలు చేసి, దాదాపు 2.5 ఏళ్ల సమయం తీసుకుని, అమెరికన్ డ్రీమ్‌కి రెండో జన్మ ఇచ్చాడు. ఈ రిస్టోరేషన్ ఖర్చు దాదాపు 2.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్లు). ఇప్పుడు ఈ కారును డెజర్లాండ్ మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు.
ఈ కారు ఎవరిది? ఎలాన్ మస్క్ కాదు, అంబానీ కాదు!
బిలియనీర్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు – ఎలాన్ మస్క్, జుకర్‌బర్గ్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ. కానీ – “ది అమెరికన్ డ్రీమ్” వారెవ్వరికి కాదు. ఈ అద్భుతాన్ని తాజాగా పొందినవాడు – మైఖేల్ డెజర్ అనే మ్యూజియం యజమాని. అతను ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యంత అరుదైన కార్లను కొనుగోలు చేయడంలో మాస్టరు. ఈ కథ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది – డిజైన్‌కు, కలలకు హద్దులు ఉండవు. ఒక సాధారణ కారు ఎలా ఒక మొబైల్ మాన్షన్‌గా మారగలదో “ది అమెరికన్ డ్రీమ్” మనకు చూపింది. ఇది కేవలం మెకానిక్స్, ఇంజినీరింగ్ గొప్పతనం కాదు – కలలు నిజమయ్యేంత వరకు వాటిని కొనసాగించే ప్రయత్నం.