IT Unit Vishaka : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ను ఐటీకి కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నగరం నుంచి ఐటీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలతో పాటు భారీగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఏపీ ఐటీ కారిడార్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. విశాఖలో వాతావరణం కూడా బాగుండడం కలిసొచ్చే అంశం. కాగా.. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు అనువైనం ప్రదేశంగా విశాఖను చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ఐటీ కోసం సరికొత్తగా ఐకానిక్ భవనాన్ని సిద్ధం చేస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఐటీ సంస్థల కోసం హైటెక్ హంగులతో సైబర్ టవర్స్ ను నిర్మించించారు. హైదరాబాద్ చరిత్రలో సైబర్ టవర్స్ ఓ ప్రత్యేక అధ్యయంగా నిలిచిపోతుంది. నగరానికి వచ్చే ఐటీ సంస్థలకు, పూర్తి ఐటీ పరిశ్రమకు గుర్తుగా ఆ భవనం నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సరిగా అలాంటి ఐకానిక్ బిల్డింగ్ నే ఏపీలోని విశాఖలో నిర్మిస్తున్నారు.
దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం, గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ వంటివి ఏర్పాటు చేయాలంటూ ఆయా సంస్థలతో చర్చలు జరిపారు. ఆ సంస్థలు రాష్ట్రంలో ఉన్న వసతులు, విస్తరణ అవకాశాల్ని పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వం అందించే సదుపాయాలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడులు పెడతాయి. అందుకే.. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు.. వారికి కావాల్సిన వసతుల్ని సమకూర్చేందుకు.. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) ఓ ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ భవనం పనులు దాదాపు పూర్తిగాక.. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
సువిశాలమైన ఆఫీస్ స్పేస్ తో పాటు ఏకంగా ఐదు అంతస్తుల్లో కార్ల పార్కింగ్ సౌకర్యంతో ఈ భవనం సిద్ధమవుతోంది. నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ ఐకానిక్ బిల్లింగ్ ను పదకొండు అంతస్తులుగా డిజైన్ చేయగా.. అందులో మొదటి 5 అంతస్తుల్లోని 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేవలం పార్కింగ్ కోసమే కేటాయించారు. మిగతా ఆరు అంతస్తుల్లోని 1.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఆఫీస్ స్పేస్ గా అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో తీర్చిదిద్దిన ఈ భవనంలో.. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా డిజైన్ చేశారు.
Also Read : రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే ముందుకొచ్చే టెక్ సంస్థలకు ఈ భవనంలోనే ఆఫీస్ స్పేస్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సువీశాల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండటంతో జిసిసిలకు, బహుళ జాతి సంస్థకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. నగరానికి నడిబొడ్డున ఉన్న భవనంలో టెక్ సంస్థల కార్యకలాపాలు మొదలయితే.. విశాఖకు సరికొత్త గుర్తింపు సొంతమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.