Nature Tourism: సాధారణంగా ప్రాణం ఉన్న ఏ జీవికి అయినా అంతం అనేది ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ జీవికి మాత్రం అంతం ఆ దరిదాపులకు రాలేదు.. ఇక రాదేమో కూడా. ఇలాంటి అద్భుతం ఎక్కడ ఉందని అనుకుంటే పొరపాటే. ఏపీలో ఈ అద్భుత జీవి ఉంది. ప్రాణం ఉన్న ప్రతి దానిని జీవి అంటాం. అలాగే సజీవ జీవులు అని కూడా అంటాం. సాధారణంగా మనం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటే, ఆ ఆనందం వర్ణనాతీతం. కానీ ఈ జీవి మాత్రం ఏకంగా 164 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంతకు అదేమిటి? ఇదెక్కడుంది? అన్ని వివరాలు కావాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఇదొక అద్భుతం..
మీకు ప్రకృతిని చూసి ఆశ్చర్యపడే అలవాటుందా? అయితే ఇది చదవకుండా మిస్ అవ్వకండి. మీ కన్నులారా చూడదగ్గ అద్భుతం.. ఏకంగా 164 ఏళ్ల నాటి చెట్టు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. గాలిలో తేలిపోయే చల్లని మబ్బులు, వృక్షవనాల మధ్య వెలసిన ఈ చెట్టు.. కాలంతో పోటీ పడుతూ ఇప్పటికీ నిలబడి ఉండడం నిజంగా వింతగానే ఉంటుంది కదూ..!
దీని ముద్దు పేరు అన్నయ్య..
చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ గురించి ఇప్పటికే చాలా మంది విని ఉంటారు. ఎప్పుడూ చల్లగాలులతో నిండిన ఈ హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది. కానీ అక్కడే ఓ మర్మమైన కోణం ఉంది, అది 164 ఏళ్ల నాటి ఓ వట వృక్షం. స్థానికులు దీన్ని అన్నయ్య చెట్టు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలాకాలంగా హార్సిలీ హిల్స్‌కు ఓ రక్షణ కవచంలా నిలుస్తూ వచ్చింది.
ఈ చెట్టు పుట్టింది అప్పుడే!
ఈ చెట్టు మొదటగా నాటబడిన సంవత్సరం 1861. అప్పట్లో బ్రిటీష్ అధికారులు ఈ ప్రాంతాన్ని వేసవికాలపు విశ్రాంతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అప్పట్లో అక్కడి కలెక్టర్ అయిన మైల్స్ బ్రౌన్ అనే అధికారి ఈ చెట్టును నాటించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వృక్షం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది.
ఇది ఎందుకంత స్పెషల్ అంటారా?
సాధారణంగా వట వృక్షాలు బహుళ సంవత్సరాలు జీవించగలుగుతాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చెట్టు ఇప్పటికీ ఆకుల పచ్చదనంతో, భారీ కాండంతో, విరాటవ్విన పైడలతో జీవంతో కళకళలాడుతోంది. చెట్టు చుట్టూ ప్రత్యేకమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులకు సమాచారం ఇచ్చే బోర్డులు కూడా పెట్టారు. అసలు 150 ఏళ్లు దాటిన చెట్టు అంటే ఊహించుకోండి.. అది ఎన్ని తుఫాన్లను తట్టుకుంది? ఎన్ని ఉష్ణోగ్రతల మార్పులను భరించింది? ఇవన్నీ ఈ వృక్షంలో కథలుగా మిగిలిపోయాయి.
పర్యాటకులకు ఓ ఫోటో పాయింట్!
హార్సిలీ హిల్స్‌కు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పకుండా ఈ చెట్టు వద్ద నిలిచి సెల్ఫీలు తీసుకుంటారు. ఎందుకంటే ఇది చరిత్రను తాకే అవకాశం. పచ్చని చెట్టు నీడలో కూర్చొని ఒక కాఫీ తాగడం.. సెల్ నెట్‌వర్క్ లేకుండానే మనసు నెట్‌వర్క్‌లోకి వెళ్లిపోవడం.. ఇలాంటి అనుభవం అక్కడ తప్ప మరెక్కడా దొరకదు. అందుకే ఇది హార్సిలీ హిల్స్ ఐకాన్. అక్కడి స్థానికులకే కాదు, అధికారులు కూడా ఈ చెట్టును ప్రాతినిధ్యంగా చూపిస్తున్నారు. ఇటీవల దీన్ని పర్యావరణ వారసత్వ చిహ్నంగా గుర్తించాలనే ప్రతిపాదనలు సైతం ఉన్నాయట. ప్రభుత్వ శాఖలూ, పర్యావరణ కార్యాలయాలూ దీన్ని రక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: Rare Indian Traditions: ఇద్దరు భర్తల సాంప్రదాయం.. ఎక్కడో కాదు, ఇండియాలోనే!
ఇంకా చూడదగ్గవి ఏంటి?
ఈ చెట్టు ఒక్కటే కాదు. హార్సిలీ హిల్స్ మొత్తం ప్రకృతి తల్లి చేతుల నుంచి వచ్చిన కళాఖండం. ఎలుగుబంట్ల అభయారణ్యం, గాలికి ఊగే యూకలిప్టస్ చెట్లు, నల్లమల అడవుల పరిసరాలు.. ఇవన్నీ చూసే సరికి మీరు పూర్తిగా రిలాక్స్ అవుతారు. అక్కడి వాతావరణం సుమారు 18 నుండి 22 డిగ్రీల మధ్యే ఉంటుంది. వేసవిలో కూడా చల్లగాలులు ఊదిపోతూ ఉంటాయి. అందుకే చిత్తూరు దగ్గర ఎవరైనా సరే ఓ వారం ఫ్యామిలీతో గడపాలంటే ఇదే బెస్ట్ ప్లేస్.
ఈ చెట్టు కేవలం ప్రకృతికి సంబంధించినదే కాదు.. మన చరిత్రకు కూడా సాక్ష్యం. 164 ఏళ్ల నుంచి మిగిలి ఉండే చెట్టు అంటే ఎంతటి సంరక్షణ, ఎలాంటి బలమైన వాతావరణం ఉండాలంటే..! ఇది మనం చూసి గర్వపడే, పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరే సందర్భం. మనం నగరాల్లో ఓ చిన్న మొక్కను నిలబెట్టుకోలేక పోతున్న రోజుల్లో, ఇలాంటి చెట్టు మనకెన్నో చెప్పే సందేశాన్ని ఇస్తోంది. హార్సిలీ హిల్స్ వెళ్లినప్పుడు, ఈ చెట్టును తప్పకుండా చూడండి.. సెల్ఫీ ఒక్కటి తీసుకోండి.. కానీ, ఒకసారి చెట్టు దగ్గర నిలబడి, దాని నిశ్శబ్దాన్ని వినండి. ఆ అనుభూతి పొందండి!