AP Liquor Case: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. కాసేపట్లో న్యాయస్థానం నుంచి నేరుగా రాజమండ్రి జైలుకి తరలించనున్నారు అధికారులు.
ఏపీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. సిట్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది కోటేశ్వరరావు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని, పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో ఆయన ఏ-4గా ఉన్నారని, ఇప్పటికే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కొట్టి వేసిందని వివరించారు. ఆయన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. మిథున్ రెడ్డిపై గతంలో ఏడు క్రిమినల్ కేసు ఉన్నాయని గుర్తు చేశారు.
దర్యాప్తు సంస్థకు ఆయన ఏ మాత్రం సహకరించలేదని, నిందితుడికి కస్టోడియల్ విచారణ అవసరమని కోరింది సిట్. ముడుపుల పంపిణీ, కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మిథున్ రెడ్డికి చెందిన శివశక్తి డెయిరీకి అక్రమంగా నిధులు చేరినట్టు నిర్థారించినట్టు ప్రస్తావించింది. షెల్ కంపెనీల ద్వారా ముడుపులు ఎలా చేరాయో తెలియాల్సి ఉందన్నారు.
ALSO READ: యానాంలో పులస చేప హంగామా.. రికార్డు స్థాయిలో ధర
పదేళ్లకు పైబడి శిక్షపడే సెక్షన్లు ఉన్నాయని, రీజన్స్ ఫర్ అరెస్టులో తెలిపింది సిట్. మిథున్‌రెడ్డి తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి. సిట్ చేసిన వాదనలను ఆయన తోసిపుచ్చారు. మద్యం పాలసీ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఈయన ప్రస్తుతానికి ఎంపీ అని గుర్తు చేశారు.
అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఈసీజీ రిపోర్టులో తేడా ఉందని న్యాయాధికారికి తెలిపారు. 409 సెక్షన్ వర్తించదని వాదించారు. రిమాండ్‌కి ఇస్తే నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని కోరారు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు. పోలీసు కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకి రిమాండ్ ఇవ్వాలని కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాదులు.