అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి మరోసారి అలజడి చెలరేగింది. ఆయన వయసు 79 ఏళ్లు. ఇప్పటికీ ఆయన ఇంకా ఫిట్ గానే ఉన్నారు కానీ, వయసు రీత్యా ఆయనకు ఏ చిన్న నలత చేసినా వ్యక్తిగత సహాయకులు కలవరపడిపోతున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఆరోగ్యంపై సామాన్య ప్రజలనుంచి పలు అనుమానాలు వ్యక్తం కావడం విశేషం. ఇటీవల ట్రంప్ న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ పోటీలను వీక్షించడానికి వెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా కనిపించిన ఫొటోలు బయటకొచ్చాయి. కుడి చేయి కూడా వాచినట్లు కనపడుతోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ మెసేజ్ లు పెట్టారు. ఈ మెసేజ్ లకు వైట్ హౌస్ వెంటనే స్పందించింది. ట్రంప్ అనారోగ్యం గురించి పలు వివరాలు తెలియజేసింది.
అసలు ట్రంప్ కి ఏమైంది..?
వైట్ హౌస్ వర్గాలు తెలిపిన వివరాల మేరకు ట్రంప్ కి నరాలకు సంబంధించిన ఇబ్బంది ఉంది. దీన్ని వీన్స్ ఇన్ సఫియెన్సీ అంటారు. సిరలలో వాపు కూడా దీనివల్లేనని నిర్థారించారు. శరీరంలో రక్త ప్రసరణలో సమస్య వల్ల సహజంగా 70 ఏళ్ల వయసు తర్వాత ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు చెప్పారు. 80 ఏళ్ల ట్రంప్ కి ఇలాంటి పరిస్థితి రావడం సహజమేనని అన్నారు. ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండల వద్ద ఉన్న వాపుని కూడా వైద్యులు పరీక్షించారు. ఈ వాపు సాధారణంగా వచ్చేదేనని చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్టు వైట్ హౌస్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. అయితే ట్రంప్ తరచూ ఇతరులతో కరచాలనం చేయడం వల్ల, దీర్ఘకాలికంగా ఆస్పిరిన్ వాడటం వల్ల ఆయన రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తి నరాల వాపు కనపడిందని స్పష్టం చేశారు. దీనికి మరే ఇతర కారణం లేదన్నారు.
గుండె పరీక్షలు..
ట్రంప్ కి వీన్స్ ఇన్ సఫియెన్సీ ఉందని అంటున్న వైట్ హౌస్ అధికారులు, ఎందుకైనా మంచిదని గుండె పరీక్షలు కూడా చేయించారు. గుండె, కిడ్నీ పరీక్షల్లో ట్రంప్ పూర్తి ఫిట్ గా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆయనకు గుండెకు సంబంధించిన ఇబ్బందులేవీ లేవని చెప్పారు. ట్రంప్ కి ఈసీజీ తీశారు వైద్యులు. గుండె పనితీరు బాగానే ఉందని ఈసీజీలో తేలింది. దీంతో వైట్ హౌస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
అధ్యక్షుల్లో అత్యంత వృద్ధుడు
అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వారిలో అత్యంత వృద్ధుడు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి ఆయన అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయి వైద్యపరీక్షలు నిర్వహించారు. అందులో కూడా ఎలాంటి లోపాలు కనపడలేదు. ట్రంప్ కుడిచెవిపై తుపాకి గుండు గాయం తాలూకు మచ్చలు మాత్రం ఉన్నాయి. ట్రంప్ ఆరోగ్యం బాగుందని, ఆయన గుండె పనితీరు అద్భుతంగా ఉందని, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ కూడా చురుకుగా ఉందని చెప్పారు ఆయన వ్యక్తిగత వైద్యుడు కెప్టెన్ సీన్ బార్బబెల్లా. దీంతో ట్రంప్ అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని తేలిపోయాయి.