Achchennaidu: ఆర్నాబ్ తుఫాను వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ముంచెత్తాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికి వచ్చే సమయంలో వరద పాలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు.
వరి, ఉద్యాన పంటలకు ఊహించని నష్టం
రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో సుమారు 2,24,489 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీటమునిగాయి. దీనివల్ల దాదాపు 3.45 లక్షల మంది రైతుల జీవనోపాధి దెబ్బతింది. ముఖ్యంగా 154 మండలాల్లో 2.11 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ పంటలు దెబ్బతింటే, అందులో 2.09 లక్షల హెక్టార్లు ఒక్క వరి పంట కావడం గమనార్హం. పశ్చిమ గోదావరి (82%), కోనసీమ (75%), కాకినాడ (48%) జిల్లాల్లో వరి విస్తీర్ణం అత్యధికంగా నీటమునిగింది. వీటితో పాటు 12,763 హెక్టార్లలో అరటి, కొబ్బరి, కూరగాయలు, తమలపాకు వంటి ఉద్యాన పంటలు పాడై 25,914 మంది రైతులు నష్టపోయారు.
కేంద్రం ముందస్తు నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం ముందస్తుగా 1.05 కోట్లకు పైగా హెచ్చరిక సూచనలు జారీ చేసినప్పటికీ తుఫాను తీవ్రత వల్ల నష్టం తప్పలేదు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి త్వరలోనే సమగ్ర నివేదికను కేంద్రానికి పంపనున్నారు. అయితే, సమర్పించే నివేదిక కోసం వేచి చూడకుండా అత్యవసర సహాయక చర్యల కోసం కేంద్రం ముందస్తు నిధులను విడుదల చేయాలని మంత్రి కోరారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకు పెట్టుబడి రాయితీ అందించేలా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యక్తిగతంగా చొరవ చూపాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
Also Read: 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. స్థానిక ఎన్నికలపై కీలక దిశానిర్దేశం!