Tamil Nadu: దీపావళి పండుగకు ముందు తమిళనాడు ప్రజలకు విజయ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో ఆటో ఛార్జీలను భారీగా సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ డెయిరీ కోఆపరేటివ్ సంస్థ ‘ఆవిన్’ కూడా తమ ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచేసింది. ఈ రెండు నిర్ణయాలు ఒకేసారి అమల్లోకి రావడంతో సాధారణ ప్రజల జేబులకు చిల్లు పడనుంది.
ఆటో డ్రైవర్లు సుదీర్ఘకాలంగా చేస్తున్న నిరసనలు, ఆందోళనల ఫలితంగా తమిళనాడు ప్రభుత్వం ఆటో ఛార్జీలను సవరించింది. ఆటో కనీస ఛార్జీని (మినిమం ఫేర్) ఏకంగా రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మెుదటి 1.8 కిలోమీటర్లకు గతంలో ఉన్న రూ.25 ఛార్జీని ఏకంగా రూ.50కి పెంచారు. తొలి 1.8 కిలోమీటర్ల తర్వాత పడే ప్రతి అదనపు కిలోమీటరుకు ఛార్జీని రూ.12 నుంచి రూ.25కు పెంచారు. మరోవైపు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణించే వారికి సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నారు. కొత్త ఛార్జీల ప్రకారం ప్రతి నిమిషానికి రూ.1 వెయిటింగ్ ఛార్జీగా నిర్ణయించారు. చివరిగా 2013లో ప్రభుత్వం ఆటో ఛార్జీలను సవరించగా మళ్లీ ఇన్నాళ్లకు ఈ కొత్త ఛార్జీలకు సంబంధించి అధికారిక గెజెట్ విడుదల చేసింది.
ఆటో ఛార్జీల పెంపు ప్రకటన రావడానికి ఒక రోజు ముందే.. తమిళనాడు ప్రభుత్వ రంగానికి చెందిన ‘ఆవిన్’ డెయిరీ సంస్థ తమ నెయ్యి, వెన్న, పెరుగు, లస్సీ, పాల తీపి పదార్థాలు, కుకీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టీవీకే (TVK) నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిన్ సంస్థ ధరలను పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెరిగిన పాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి.
* నెయ్యి (100 మి.లీ): పాత ధర రూ. 80 కాగా, ఇప్పుడు అది రూ. 95కి చేరింది.
* నెయ్యి (200 మి.లీ): పాత ధర రూ.160 నుంచి ఏకంగా రూ.180కి పెరిగింది.
* వెన్న (100 గ్రాములు): రూ. 60 నుండి రూ. 70కి పెరిగింది.
పెరిగిన ఆవిన్ ఉత్పత్తుల కొత్త ధరలు బుధవారం (అక్టోబర్ 28) నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఒకేసారి రవాణా ఛార్జీలు, నిత్యావసరాలైన పాల ఉత్పత్తుల ధరలు పెరగడంతో తమిళనాడులోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో ధరలు పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో బంధువుల రాకపోకలు అధికంగా ఉండటం, పాల వినియోగం పెరిగే సమయంలో ఇలా ధరలు పెంచి సామాన్యులపై విజయ్ ప్రభుత్వం భారం మోపిందని పలువురు మండిపడుతున్నారు.