TTD : తిరుమలలో టైట్ సెక్యూరిటీ ఉంటుంది. నిఘా నేత్రాలను దాటుకుని చీమ కూడా లోనికి చొరపడదు. ఎప్పుడో ఒక్కసారి మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు లాంటివి కనిపిస్తే అదే ఎక్కువ. అంతటి పటిష్ట భద్రత ఉంటుంది కాబట్టే.. గుట్కా ప్యాకెట్ కనిపించినా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అన్యమత ప్రచారం గట్రా చేయాలని కొన్ని ముఠాలు విశ్వప్రయత్నం చేస్తున్నా.. ఎప్పటికప్పుడూ వాటికి చెక్ పెడుతూనే ఉంది టీటీడీ యంత్రాంగం. ప్లాస్టిక్ నిషేధంపైనా అంతే సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను అలిపిరి దగ్గరే చెక్ పెడుతోంది. కొండ మీద ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా అలిపిరి చెక్ పోస్ట్.. అడ్డుగోడలా నిలుస్తోంది. కొండ కింద ఖతర్నాక్ సెక్యూరిటీ ఉంది కాబట్టే.. కొండ మీద అంత ప్రశాంతత నెలకొంది. లేటేస్ట్‌గా అలిపిరి చెక్ పాయింట్ తన పని తీరుతో మరోసారి వార్తల్లో నిలిచింది.
బ్యాగ్‌లో గన్..
అప్పుడే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి ఓ కారు వచ్చి ఆగింది. కారు నెంబర్‌ను బట్టి అది కర్నాటక బండి అని తెలిసిపోతోంది. టీటీడీ సిబ్బంది ఎప్పటిలానే కారును ఆసాంతం చెక్ చేస్తున్నారు. ఆ కారు యజమాని చేతిపై లయన్ టాటూ ఉంది. గడ్డంతో, తలపై క్యాప్‌తో షార్ట్, టీ షర్ట్ వేసుకుని ఉన్నాడతను. అతన్ని చూస్తే ఎలాంటి అనుమానం కలగలేదు సిబ్బందికి. కారు డిక్కీ ఓపెన్ చేయమన్నారు. అందులో ఓ బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే ఆ బ్యాగ్‌లో దూరపు వస్తువులను చూసేందుకు యూజ్ చేసే టెలిస్కోప్ ఉంది. SPF సిబ్బందికి అనుమానం పెరిగింది. మరింతగా తరచి చూస్తే అదే బ్యాగ్ లోపలి జిప్‌లో గన్ బయటపడింది. అంతే. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సెక్యూరిటీ స్టాఫ్.
తెలీక తెచ్చాడట..
అలిపిరిలో గన్ కనిపించడమంటే మామూలు విషయం కాదు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే, అది ఎయిర్ పిస్టల్ అని ఆ తర్వాత తేలింది. తిరుమలకు అలాంటి వస్తువులు తీసుకు రాకూడదని తనకు తెలీదన్నాడు ఆ బెంగళూరుకు చెందిన భక్తుడు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి.. టెలిస్కోప్, ఎయిర్ పిస్టల్ తిరిగి ఇచ్చేశారు. కాకపోతే వాటిని తిరుమల కొండపైకి తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కారును తిరిగి వెనక్కి పంపించేశారు విజిలెన్స్ అధికారులు. ఎయిర్‌గన్‌ను పసిగట్టిన అలిపిరి ఎస్పీఎఫ్ సిబ్బంది పని తీరును ప్రశంసిస్తున్నారు భక్తులు.