ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మీ తోకలు కత్తిరిస్తా – సీఎం చంద్రబాబు
మీరు కత్తిరించేదేంటి, ఆల్రడీ ప్రజలే మా తోకలు కత్తిరించాలు – మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఇక్కడ చంద్రబాబుకి బదులుగా అంబటి బ్రహ్మాండంగా మాట్లాడారు అనుకోలేం. తన సొంత పార్టీపై తానే జోక్ చేశారని, ఒకరకంగా వైసీపీ పరువు తీశారని అనుకోవాల్సిన సందర్భం. మా తోకలు జనమే కత్తిరించారు అని అంబటి అన్నారంటే, అధికారంలో ఉన్నప్పుడు తోకజాడించామనే అర్థం వచ్చినట్టే కదా. అంటే పార్టీని ప్రత్యక్షంగా, జగన్ ని పరోక్షంగా అంబటి కామెంట్ చేసినట్టే కదా. అందుకే ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా…..😝😝 pic.twitter.com/pa6EXjFIZP
— MC RAJ🕊️ (@BeingMcking_) August 2, 2025
అసలు చంద్రబాబు ఏమన్నారు?
ఆగస్ట్ 1న చంద్రబాబు పీ4 కార్యక్రమం గురించి కడప జిల్లాలో పెట్టిన సభలో ప్రతిపక్షంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు, వైసీపీ మీడియా కూడా అసత్య ప్రచారంతో అనుమానాలకు తావిచ్చే వార్తలిస్తోందన్నారు. అలాంటి పనులు ఎవరు చేసినా తోక కత్తిరిస్తామన్నారు చంద్రబాబు.
అంబటి రియాక్షన్ ఏంటి?
తోక కత్తిరిస్తామంటూ చంద్రబాబు తమని హెచ్చరిస్తున్నారని, ఆయనకు అంత అవసరం లేదని, ఆల్రడీ ప్రజలే తమ తోకలు కత్తిరించారని చెప్పుకొచ్చారు అంబటి. ఇక్కడ అంబటి వెటకారంగా మాట్లాడారు కానీ, ఆ వెటకారం సొంత పార్టీపైనే కావడం విశేషం. ఆ మాటకొస్తే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అంబటి రాంబాబు సొంత పార్టీపై సెటైర్లు పేల్చారు. పాలన బాగోలేదని అనుకున్నారు కాబట్టే ప్రజలు తమని 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఈవీఎంలపై తమ పార్టీ నేతలంతా నెపం నెట్టేస్తున్నా, అంబటి మాత్రం దాన్ని కూడా ఓ కారణంగా చెప్పారు. అంతే కానీ ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని డిసైడ్ చేయలేదు. ఇక ఓటమితో తాము షాక్ కి గురయ్యామని అన్నారాయన. అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీ ఓటమిని ఆ పార్టీ నేతలు జనం తప్పుగా, చంద్రబాబు మోసంగా ప్రచారం చేస్తున్నారు కానీ, అందులో వైసీపీ తప్పిదాల్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించినా వాటిని సరిచేసుకుంటామని చెప్పేందుకు మొహమాట పడుతున్నారనుకోవాలి.
వైసీపీ ఘోర పరాభవం తర్వాత కొంతమంది నేతలు ఆ తప్పుని కోటరీపైకి నెట్టే ప్రయత్నం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే వైసీపీ ఓటమి పాలైందని అన్నారు. కాలక్రమంలో ఆ నేతలంతా తిరిగి ఈవీఎంలపై పడ్డారు. కోటరీని వదిలేశారు. విజయసాయిరెడ్డి వంటి నేతలు మాత్రం కోటరీ ఆరోపణలకు కట్టుబడి పార్టీనే వీడి బయటకు వచ్చారు. మిగిలినవారంతా జగన్ సూచనల ప్రకారం ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని నమ్ముతూ, జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు అంబటి రాంబాబు వంటి వారు మాత్రం వైసీపీ తోకల్ని జనం జాగ్రత్తగా కత్తిరించారని ఒప్పుకుంటున్నారు. అంబటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైసీపీ అనుకూల హ్యాండిళ్లు గాభరా పడుతున్నాయి. టీడీపీకి సపోర్ట్ చేసే సోషల్ మీడియా హ్యాండిళ్లు ట్రోలింగ్ మొదలు పెట్టాయి. అంబటి నిజం ఒప్పుకున్నారని వారు మెచ్చుకుంటున్నారు.