పరామర్శలు అంటే తెలుగు రాష్ట్రాల్లో దానికి బ్రాండింగ్ ఒక్క జగనేననే కామెంట్ ఇప్పటి వరకూ ఉంది. ఇటీవల అంబటి రాంబాబు జగన్ నుంచి ఆ బాధ్యతను కాస్త బదిలీ చేసుకున్నట్టుంది. ఆమధ్య జైలులో ఉన్న పోసానిని జగన్ తరపున కలిసింది అంబటి రాంబాబే. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా పోలీస్ స్టేషన్ల వద్ద హడావిడి చేసిన టీమ్ లో అంబటి కీలకంగా ఉన్నారు. తాజాగా కృష్ణవేణి అనే మహిళ విషయంలో కూడా అంబటి హడావిడి చేస్తున్నారు. రాగాపోగా ఈమధ్య పేర్ని, కొడాలి, రోజా బదులు.. అంబటి ఎక్కువగా మీడియా, సోషల్ మీడియాలో కనపడుతున్నారు. వైసీపీ తరపున హైలైట్ అవుతున్నారు.
ఎవరీ కృష్ణవేణి..
సోషల్ మీడియాలో వైరల్, వల్గర్ పోస్టింగ్ లపై పోలీసులు సీరియస్ గా దృష్టిపెడుతున్నారు. ఇటీవల కృష్ణవేణి అనే వైసీపీ అభిమానిని హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఆమెకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. మహిళ అని కూడా చూడకుండా ఆమెను వేధిస్తున్నారని అంటున్నారు అంబటి రాంబాబు. గతంలో కృష్ణవేణి టీడీపీ అభిమానిగా ఉండేవారు. అప్పట్లో ఆమె జగన్ ని టార్గెట్ చేస్తూ కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు వాటిని టీడీపీ నేతలు బాగా వైరల్ చేస్తున్నారు. జగన్ ని తిట్టినందుకే ఆమెని అరెస్ట్ చేశారంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. కానీ వాస్తవానికి కూటమిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పోస్టింగ్ లు పెట్టినందుకు అరెస్ట్ అయ్యారు. సహజంగానే వైసీపీ ఆమెకు మద్దతుగా నిలబడింది. కూటమి నేతలు అరెస్ట్ చేయించిన తొలి మహిళా నేత కావడంతో సహజంగానే ఆమెపై సింపతీ ఉంటుందని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు. పోలీసులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
కృష్ణవేణికి అంబటి ఓదార్పు..
పాలేటి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఏ అత్యంత దారుణంగా వ్యవహరించారని అంటున్నారు అంబటి. ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించారని, ఆమె భర్తపై గంజాయి స్మగ్లింగ్ కేసు పెడతానన్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు అంబటి. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో పాటు అంబటి రాంబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణవేణిని పరామర్శించారు. జగన్ తరపున ఆమెని ఓదార్చారు అంబటి.
జగన్ ఫొటో ఉండాల్సిందే..
వైసీపీ ఓటమి తర్వాత మిగతా నాయకులంతా సమయానుకూలంగా స్పందిస్తున్నారు కానీ, అంబటి రాంబాబు మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగనన్న ఫొటో ఉన్న చొక్కా లేకుండా ఆయన బయటకు రావడం లేదు. అంబటి కెమెరా ముందుకొచ్చారంటే కచ్చితంగా ఆయన షర్ట్ పై జగన్ ఫొటో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో తాను జగన్ కి అండగా ఉన్నాననే సంకేతాల్ని పంపించేందుకే అంబటి హడావిడి చేస్తున్నారని టీడీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.
అంబటి ఇటీవల తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎడా పెడా వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. సాక్షి మీడియాలో కవరేజీ బాగానే ఉన్నా కూడా అంబటి సొంత అజెండాతో ఈ వీడియోలు విడుదల చేస్తున్నారు. మొత్తానికి జగన్ తరపున అంబటి ఓదార్పు యాత్రలు మొదలు పెడుతున్నారని, ముఖ్యంగా అరెస్ట్ అయిన వారిని, రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని ఆయన కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మిగతా నాయకులంతా సైలెంట్ కావడం, సజ్జల అజ్ఞాతంలో ఉండటంతో ప్రస్తుతానికి అంబటి వైసీపీ తరపున హైలైట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.