Love Rooms For Prisoners| ఒక దేశంలో జైళ్లలో ఉన్న ఖైదీల మానసిక స్థితి మెరుగుపరిచేందుకు వారికి ఊహించని వసతులు కల్పించబడ్డాయి. దీనంతటికీ ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు కారణం. “జైళ్లలో ఖైదీలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వాళ్ల మానసిక ఆరోగ్యం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతోంది. ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వాములతో బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది.” అని ఇటలీ సుప్రీం కోర్టు (Italy Constitution Court) పేర్కొంది. ఖైదీలకు వారి భాగస్వాములతో శారీరకంగా కలిసే అవకాశం కల్పించడం వాళ్లకు ఉన్న మౌలిక హక్కుల్లో ఒకటిగా పేర్కొంటూ, అటువంటి అవకాశం ఇవ్వాలని కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది.
ఈ తీర్పు అనుసరించి ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి ప్రత్యేక శృంగార గదులు అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని ఓ జైలులో ఓ ఖైదీకి తన భార్య లేదా తన ప్రియురాలితో ఏకాంతంగా కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఉద్దేశంతోనే అక్కడ “లవ్ రూమ్” (Love Room) పేరిట ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. మామూలుగా జైళ్లలో ములాఖత్ సమయంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక ఏకాంత కలయిక సమయంలో ఎవరూ పక్కన ఉండకుండా పూర్తి ప్రైవసీ కల్పించారు. న్యాయశాఖ ఈ తరహా సదుపాయాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది.
ఉత్తర ఇటలీలోని అస్టి (Asti) జైలులో ఉన్న ఓ ఖైదీ.. తాను తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని కోరుతూ ట్యూరిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో ఆయన ఇటలీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని సమాచారం.
ఇటలీలోని జైళ్ల గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 62,000 ఖైదీలు ఉన్నారు. ఇది ఆ జైళ్ల సామర్థ్యాన్ని 21 శాతం మించి ఉంది. ఖైదీల సంఖ్య మితిమీరిపోవడం వల్ల ఖైదీలపై మానసిక ఒత్తిడి పెరిగి, వారు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువైపోయాయి. దీనిపై ప్రభుత్వ అధికారులు, జైళ్ల శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఖైదీలు తరచుగా తమ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడే వీలు కల్పించారు. ఇప్పుడు, తమ భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకునే సౌకర్యం కూడా కల్పించారు.
ఈ తరహా సదుపాయాలు యురోప్ లోని మరికొన్ని దేశాల్లో ముందుగానే ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్‌లలోని కొన్ని జైళ్లలో ఖైదీలకు ఇలాంటి ఏకాంత గదులు ఉన్నట్లు తెలిసింది.
Also Read: శవం ముందు ప్రియురాలితో పెళ్లి.. తమిళనాడులో వింత వివాహం
మొత్తంగా చెప్పాలంటే, యురోప్‌లో అత్యధికంగా ఖైదీలతో నిండిపోయిన జైళ్లు ఇటలీలోనే ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 62,000 మందికి పైగా ఖైదీలు వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సంఖ్య దేశంలోని జైళ్ల గరిష్ఠ సామర్థ్యానికి 21 శాతం మించి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వారిని కుటుంబాల నుంచి పూర్తిగా దూరం చేయకుండా చూడాలన్న ఉద్దేశంతో ఇటలీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఖైదీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంస్థలు, గ్రూపులు ఈ తీర్పును స్వాగతించాయి.