IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగ్స్ పై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ మార్పులు చేపడుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పలు శాఖల్లో ముఖ్యమైన స్థానాలను భర్తీ చేయడంతో పాటు మరికొందరిని ప్రస్తుతం ఉన్న బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
కీలక శాఖల్లో ముఖ్యమైన మార్పులు
సీనియర్ అధికారుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఎస్.ఎస్. రావత్ ను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. జె. శ్యామలరావును పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. కోనా శశిధర్ కు రవాణా, రోడ్లు-భవనాల శాఖ కార్యదర్శి బాధ్యతలు దక్కాయి. ఇక హెప్సిబా రాణి కొర్లపాటిని హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ.. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీగా ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు.
పర్యాటకం, రవాణా, వైద్య సేవలు
ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి ఆమ్రపాలి కాటాను రిలీవ్ చేస్తూ, జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆమె స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్ ను కొత్త ఎండీగా నియమించారు. రవి సుభాష్ కు APPSC సీఈఓ, సెక్రటరీ పోస్టుల ఎఫ్ఏసీ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివ ప్రసాద్ బదిలీ అయ్యారు. వైద్య రంగానికి సంబంధించి పి. అరుణ్ బాబు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా, ఎ.ఎ.ఎల్. పద్మావతికి ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఈవోగా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. కేవీఎన్ చక్రధర బాబును ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా ఎఫ్ఏసీ బాధ్యతల్లో నియమించారు.
తిరుపతి, పుష్కరాలు.. ఇతర నియామకాలు
రాబోయే గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా సురేష్ కుమార్, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నారాయణ భరత్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు. విఎంఆర్డిఏ కమిషనర్ గా ప్రఖర్ జైన్ బాధ్యతలు చేపడుతుండగా, తేజ్ భరత్ ను ఆ స్థానం నుండి రిలీవ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం జాయింట్ ఈవోగా విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ ఎ. శరత్ ను కొనసాగిస్తూనే, ప్రభల గోపీనాథ్ కు కూడా టీటీడీ జేఈవో బాధ్యతలు ఇచ్చారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఎం. జయకృష్ణ నియమితులయ్యారు.