YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ.. పార్టీ ఆధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తలతో (రీజినల్ కో-ఆర్డినేటర్లు) అమరావతిలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, అలాగే టీడీపీ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే ముఖ్యం
స్థానిక సంస్థల పోరులో బలమైన, ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను వీలైనంత వేగంగా బరిలోకి దించాలని జగన్ సూచించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలోని అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించాలని, పలు దఫాలుగా నాయకులతో చర్చించి పక్కా జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి నిర్ణయాలు రాబోయే సాధారణ ఎన్నికలకు పునాదిగా ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చి ముందుండి నడిపించాలని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం.. గడప గడపకూ పార్టీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. చంద్రబాబు పాలనలోని వైఫల్యాలను, ప్రజలకు చేసిన వెన్నుపోట్లను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన మేలును, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను గడప గడపకూ వెళ్లి వివరించాలని కోరారు. స్థానిక నాయకత్వాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ.. పార్టీని గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని నిర్దేశించారు.
అక్రమాలను ఎదుర్కొనేందుకు సద్ధం
అధికారాన్ని, పోలీసు బలాన్ని అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అడ్డదారులు తొక్కుతారని, అలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు శ్రేణులు అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని జగన్ హెచ్చరించారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ వ్యూహాలతో ముందడుగు వేయాలన్నారు.
ఈ సమావేశంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.