AP Heavy Rains: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో రేపు(గురువారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడనం ఎల్లుండికి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి, శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీవర్షాలు, శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. రేపు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
గురువారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
కృష్ణానదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.55 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి హెచ్చరిక కొనసాగుతుందని రేపటికి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.
Also Ready: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఇన్ ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఈ నెల 29 నాటికి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణపై కూడా వాయుగుండం ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 26న 18 జిల్లాల్లో పలు చోట్ల 10 నుంచి 20 సెం.మీటర్ల వర్షపాతం నమోదవుతుందనే అంచనా వేసింది. 27వ తేదీన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.