Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. APSDMA హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలో నేడు భిన్నమైన వాతావరణం ఉండనుంది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, అటు నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒకవైపు ఎండ.. మరోవైపు వర్షాలు..
అయితే, వర్ష సూచన ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గడం లేదు. మన్యం, పోలవరం, విజయనగరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు వర్షం, ఇటు ఎండ కలిపి ఉక్కపోతతో జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విపరీత వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
తెలంగాణలోనూ దంచికొడుతున్న వర్షాలు..
ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న అర్ధరాత్రి నుండి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్‌తో పాటు కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం కనిపిస్తుండగా, వర్ష మేఘాలు క్రమంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైపు విస్తరిస్తున్నాయి.
భాగ్యనగరంలో కుమ్మేసిన వర్షం..
అయితే, హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై, చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజా వాతావరణ శాఖ బులిటెన్ ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రాబోయే రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం పుష్కలంగా ఉంది. వేసవి వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
రైతులకు అలర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా మారిన ఈ వాతావరణం పంట పొలాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆరబోసిన ధాన్యం తడవకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలు, వడగాల్పులు ఒకవైపు.. పిడుగులు, వర్షాలు మరోవైపు ఉండటంతో ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ భిన్న వాతావరణం రాబోయే మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: అప్పుడు మోదీ సభకు వెళ్లిన గద్దర్ గుర్తులేరా? అమిత్ షాపై భువనగిరి ఎంపీ ఫైర్