ఆపరేషన్ సిందూర్.. మీ ఓటే వజ్రాయుధం.
శత్రుదేశంపై కురుస్తున్న క్షిపణుల వర్షాన్ని చూసి సగటు భారతీయుడిగా మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది కదా..! ఈవీఎంల మీద సరైన బటన్ నొక్కినందుకే ఇంతటి ఘనత సాధ్యమైంది.
ఏపీ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేసిన ట్వీట్ ఇది. మోదీ ఫొటోతో బ్యాక్ గ్రౌండ్ లో లీడర్ సినిమా మ్యూజిక్ తో మ్యాజిక్ చేయాలని చూశారు ఏపీ బీజేపీ నేతలు. కానీ నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ టైమ్ లో రాజకీయాలేంటి అని నిలదీస్తున్నారు.
మనం సరైన నాయకత్వానికి ఓటు వేస్తే భారత్ ఎలా విజయం సాధిస్తుందో మనందరం చూస్తున్నాం. ఇంకా చాలా ఘనతలు భారత్ ముంగిట ఉన్నాయి. అందుకే మన ఓటు వజ్రాయుధంతో సమానం.#Vote #PMModi #OperationSindoor pic.twitter.com/FRtMCZpIsq
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) May 9, 2025
“ఈ టైమ్ లో ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు, మీకు సిగ్గుందా..!”
“పెళ్లి కొడుకు మంచివాడులా ఉన్నాడు అనుకునేలోపే మొదలుపెట్టేశారు కదరా ”
“దేశమంటే మట్టికాదు మనుషులు అని గురజాడ వారంటే ఈ బీజేపీ వాళ్లేమో దేశమంటే ఓటర్లు అని అంటున్నారు”
“పొరుగుదేశంతో యుద్ధానికి రాజకీయాలకు సంబంధం ఏంటి..? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా ప్రతి భారతీయుడు దేశభక్తిని చాటుతూ యుద్ధానికి సిద్ధమవుతాడు, గుర్తుంచుకోండి”
నెటిజన్ల నుంచి వచ్చిన ఘాటు రియాక్షన్లలో ఇవి కొన్ని మాత్రమే. చాలామంది ఏపీ బీజేపీ నేతల్ని ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. బీజేపీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదని మండిపడుతున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎలక్షన్లు ఉన్న వేళ.. బీజేపీ వేసిన ట్వీట్ రాజకీయ లబ్ధికోసమేనంటూ నెటిజన్లు మండిపడటం విశేషం.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే.. వాటిని రాజకీయం చేయడం, ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం వంటి చీప్ టెక్నిక్స్ గతంలో ఉండేవనే అభిప్రాయం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా కొంతమంది విశ్లేషకులు బీహార్ ఎన్నికల విషయాన్ని తెరపైకి తేగా నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలతో వారికి గడ్డిపెట్టారు. కానీ స్వయంగా బీజేపీ నేతలే ఇలాంటి ట్వీట్ వేయడంతో ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు యుద్ధం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తున్నాయి. పహల్గాం దాడిని ప్రభుత్వ నిఘా వైఫల్యంగా పేర్కొన్నా.. ఆ తర్వాత భారత సైన్యం ప్రతిస్పందన, ప్రతిఘటనకు కాంగ్రెస్ పూర్తి మద్దతునిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా యుద్ధం విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతుగా నిలబడ్డారు. నిరసన ప్రదర్శనలతో మేరా భారత్ మహాన్ అని నిరూపించారు. రాజకీయాలకు తావులేకుండా ప్రతిపక్షాలన్నీ కేంద్రం చర్యల్ని సమర్థిస్తున్న వేళ.. తమకు తామే ఇంత దిగజారి ట్వీట్ వేసుకోవాలా, ఎన్నికలు, ఓటర్లు, రాజకీయాలు అంటూ మాట్లాడాలా.. అని నెటిజన్లు ఏపీ బీజేపీ నేతలపై మండిపడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ అనే పేరుని సినిమాలకోసం వాడుకోడానికి ఆమధ్య కొన్ని నిర్మాణ సంస్థలు ఎగబడ్డాయి. ఆ ఘటనపై కూడా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దేశభక్తిని వ్యాపారం కోసం వాడుకోవాలని చూడటం సరికాదనే అభిప్రాయం అందరిలో ఉంది. అదే దేశభక్తిని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం మరింత దారుణం అంటున్నారు నెటిజన్లు.