AP CEO on Lok Sabha Elections 2024 Polling: ఏపీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతోందని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ తెలిపారు. ఏపీ పోలింగ్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణనలు జరిగాయని తెలిపారు.
కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం అని చెప్పారు. అన్నమయ్య జిల్లాలోనూ ఘర్షణలు జరిగాయన్నారు. పల్నాడు జిల్లాలో ఒక చోట ఈవీఎంలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.ఈవీఎంలను మార్చి రీపోలింగ్ తిరిగి ప్రారంభించామన్నారు. ఈవీఏం చిప్ లో డేటా భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం చేశారు.
అక్కడక్కడా ఈవీఎంల్లో సమస్యలు వచ్చినా ఈవీఎంలను మార్చామని తెలిపారు. పల్నాడు, తెనాలి, అనంతపురంలో కొందరిని గృహ నిర్భందం చేశామని చెప్పారు. ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టడంతో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని తెలిపారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఇంకా కొనసాగుతుందని అన్నారు.
ఘర్షణలకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలను అదనంగా ఉంచామని తెలిపారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తమకు ఇంటలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందిందని తెలిపారు. మాచర్లలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని అన్నారు. 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి తిరిగి పోలింగ్ నిర్వహించామని తెలిపారు
Also Read: ఏపీలో ముగిసిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్
సుమారు 200 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉందన్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. 5 గంటల వరకూ 68 శాతం వరకు పోలింగ్ నమోదైందని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరుస్తామని తెలిపారు. తుది వివరాలు పోలింగ్ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామన్నారు.