Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ప్రాణాలను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుఫాన్ ముప్పు ఎదుర్కొనేందుకు చేపడుతున్న సహాయక చర్యలపై మంగళవారం ఒక్కరోజే నాలుగు సార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక విషయాలను వెల్లడించారు.
ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తుఫాను కదలికలను గమనిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అర్నాబ్ ప్రభావాన్ని తగ్గించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనేది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని సీఎం పేర్కొన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
‘ఆర్నాబ్’ అత్యంత ప్రమాదకరమైన తుఫాన్‌గా రూపాంతరం చెందిందని.. అందుకే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని సీఎం గుర్తుచేశారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ఎవరూ భయాందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అయితే కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం వరకు తీరప్రాంత జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుండి వర్షాల తీవ్రత గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. అటు సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్లు సీఎం చెప్పారు. తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి తీరం వెంబడి నివసించే ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సీఎం వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, తమ ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయని చెప్పారు.
కాకినాడ సమీపంలోని యానం వద్ద అర్నాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశముందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకూ తుఫాన్ ప్రభావం ఉంటుందన్నారు. కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలో 30 సెంటీ మీటర్లు, పశ్చిమ గోదావరిలో 28, విశాఖ 23 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొన్నారు. చాలా చోట్ల 10 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదవుతుందని సీఎం అంచనా వేశారు.
Also Read: రూ. 20 కచోరీ తింటూ.. రూ. 20 లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి.. వీడియో వైరల్!
ఇదిలా ఉంటే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్.. గంటకు 20 కి.మీ వేగంతో తీరం వైపునకు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి విశాఖకు 170 కి.మీ, కాకినాడకు 140 కి.మీ, మచిలీపట్నంకు 230 కి.మీ, బాపట్లకు 300 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉదయానికి యానంకు సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు అంచనాలు ఉన్నాయి. తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. కాబట్టి తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే