ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని అనంతరం ఢిల్లీలో రెండు రోజులు మకాం వేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఏపీనుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటు విషయంలో కూడా బీజేపీ నేతలతో కలసి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అనంతరం ఏపీకి తిరిగొచ్చిన ఆయన.. రెండు రోజుల గ్యాప్ లో ఈరోజు తిరిగి ఢిల్లీ వెళ్లారు. ఈ సారి ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీ.. మోదీ అమరావతి పర్యటన గురించి కావడం గమనార్హం.
మోదీతో భేటీ..
మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. పహల్గాం ఉగ్రవాద దాడిపై చర్చించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయానికి ఏపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఉగ్రమూకల దాడిలో బలైన వారి కుటుంబాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ నేరుగా కలసి పరామర్శించారు. వారికి ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు.
మోదీకి ఆహ్వానం..
మే-2న ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన ఖరారైంది. అయితే పహల్గాం ఘటన నేపథ్యంలో ఈ పర్యటనపై అనుమానాలు మొదలయ్యాయి. పర్యటన పోస్ట్ పోన్ అవుతుందేమోనని అనుకున్నారంతా. కానీ మోదీ అమరావతి టూర్ యథావిధిగా కొనసాగుతుందని అధికార వర్గాలంటున్నాయి. ఈ పర్యటనకు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లారు. మే-2న అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేయాల్సిందిగా ఆయన మోదీని ఆహ్వానించారు.
I met with the Hon’ble Prime Minister, Shri @narendramodi Ji, in New Delhi today and expressed solidarity with the Union Government in the fight against terrorism. The horrific terrorist attack in Pahalgam has left the nation anguished. No amount of condemnation is enough for… pic.twitter.com/esSBMbz0Iu
— N Chandrababu Naidu (@ncbn) April 25, 2025
లక్ష కోట్ల పనులు..
ప్రధాని హోదాలో ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా మోదీనే. అయితే 2019లో టీడీపీ ఓటమితో రాజధాని పనులు పూర్తిగా ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని పక్కనపెట్టింది. ఎక్కడిపనులు అక్కడే ఆగిపోగా.. 2024లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత తిరిగి రాజధాని పనుల్లో కదలిక వచ్చింది. మరోసారి ప్రధాని మోదీని పిలిపించి అమరావతి పనుల్ని పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. సుమారు లక్ష కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్ మ్యాప్ రెడీ అయింది. వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకోసం వేదిక ఏర్పాటు చేశారు. అక్కడే మోదీ పైలాన్ ని ఆవిష్కరిస్తారు. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా. అదే రోజు 30వేలమందితో రోడ్ షో కూడా జరుగుతుంది.
పహల్గాం ఘటన నేపథ్యంలో అమరావతిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని రాక సందర్భంగా పారా మిలట్రీ బలగాలను రంగంలోకి దింపారు. విజయవాడ సహా అమరావతి పరిసరాలను జల్లెడ పడుతున్నారు. దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు అలర్ట్ కావడంతో అమరావతి పనుల పునఃప్రారంభ సభ విషయంలో భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి. ప్రధాని సభకు వచ్చేవారికి ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. అటు రోడ్ షో లో కూడా అనుమతించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు అధికారులు.