Stress: ఒత్తిడి అనే మాట విపగానే చాలా మంది భయపడతారు. ఒత్తిడి అంటే అదేదో మానసిక రుగ్మత అని, అది ఆరోగ్యానికి హాని చేస్తుందని భావిస్తారు. కానీ, నిజానికి ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక సహజమైన భాగమేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అది సరైన మోతాదులో ఉంటే, మనిషికి ఒత్తిడి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. మనిషికి ఒత్తిడి ఎందుకు అవసరమో, అది ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి అంటే..?
ఒత్తిడి అనేది మన శరీరం, మనసు ఒక సవాలును ఎదుర్కొన్నప్పుడు వచ్చే స్పందన. పరీక్షకు సిద్ధం కావడం, కొత్త ఉద్యోగంలో చేరడం, లేదా ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడం వంటివి ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి మనల్ని ఉత్సాహపరుస్తుందని థెరపిస్ట్‌లు చెబుతున్నారు. అంతేకాకుండా శ్రద్ధగా పని చేయమని ఇది ప్రేరేపిస్తుందట.
ఒత్తిడి ఎందుకు అవసరం?
మితమైన ఒత్తిడి మన మెదడు చురుగ్గా పని చేసేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు, బాగా చదవడానికి సమయాన్ని సరిగ్గా ఉపయోగించడానికి ఒత్తిడి ప్రేరేపిస్తుందని అంటున్నారు. అలాగే, ఒక అథ్లీట్ పోటీలో పాల్గొనేటప్పుడు, ఒత్తిడి అతని శక్తిని, దృష్టిని పెంచుతుందట. అలాగే, లక్ష్యాలను సాధించడానికి ఒత్తిడి సహాయపడుతుందని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఒత్తిడి లేకపోతే?
ఒత్తిడి లేని జీవితం ఊహించుకోండి. అది చాలా బోరింగ్‌గా ఉంటుంది కదా!? ఎటువంటి సవాళ్లు లేకపోతే, కొత్త విషయాలు నేర్చుకునే ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఒత్తిడి మనల్ని ఎదగమని, ముందుకు సాగమని ఒక శక్తిగా పనిచేస్తుందని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. అది లేకపోతే మనిషికి సోమరితనం వచ్చే ప్రమాదం ఉందట.
ఒత్తిడి ఎక్కువైతే?
ఒత్తిడి వల్ల ఎంతో కొంత మంచి జరిగినప్పటికీ చాలా ఎక్కువ ఒత్తిడి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి, ఇతర సమస్యలు వస్తాయట. అందుకే ఒత్తిడిని కంట్రోల్‌లో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
రోజూ వ్యాయామం, ధ్యానం చేయడం, సరైన నిద్ర పొందడం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. అలాగే, పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించడం కూడా ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందట.
ఒత్తిడి గురించి సరైన అవగాహన ఉంటే, దాన్ని ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని సరిగా మేనేజ్ చేయడం నేర్చుకుంటే అది మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని అంటున్నారు. కాబట్టి, ఒత్తిడి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని సరైన రీతిలో వాడుకోవడం తెలిసి ఉంటే ఆందోళనకు కూడా దూరంగా ఉండొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.