CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో ఆయన సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాసంపై చర్చించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్‌ను సీఎం వెల్లడించనున్నారు.
డయాఫ్రంవాల్ నిర్మాణంతోపాటు ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలో 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
నిర్వాసితుల కోసం పశ్చిమగోదావరి జిల్లాలో 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. చాలా వరకు కాలనీలు అసంపూర్తి గానే ఉన్నాయి. ఇక పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు.
నేటి పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 12 వేల ఎకరాల భూ సేకరణ చేశారు. 25 వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు 10 వేల కుటుంబాల వరకు ఉన్నాయి.
Also Read: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం
కొత్త డయాఫ్రం వాల్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలనేది…సీఎం చంద్రబాబు పరిశీలన అనంతరం నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభయ్యే అవకాశముంది.