AP Constable Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రిక్యూట్ మెంట్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఫిట్ నెస్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ అడ్డంకుల వల్ల ముందుగా అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించలేకపోతున్నట్లు తెలిపింది. కొత్తగా ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనున్న తేదీలను ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పోలీస్ నియామకాల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కానిస్టేబుల్ అభ్యర్ధులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. జనవరి 8 నుంచి 10వ తేదీల మధ్య జరగాల్సిన పీఎంటీ, పీఈటీ దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని తిరిగి జనవరి 11 నుంచి 20వ తేదీన మధ్య నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.
కాగా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో అభ్యర్థులు.. జనవరి 8వ తేదీన ఫిజికల్ టెస్టులు ఉండగా, వీటిని రెండు రోజుల ఆలస్యంగా అంటే జనవరి 11 న నిర్వహించనున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. అలాగే అనంతపురంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షల్ని.. జనవరి17, 18, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో అభ్యర్థులు.. కొత్త తేదీలను గమనించుకోవాలని, ముందుగా పరీక్షా కేంద్రాల దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడొద్దని తెలిపారు. అలాగే.. చిత్తూరులో జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న ఫిజికల్ ఈవెంట్స్ ను జనవరి 17, 18 తేదీలకు మార్చినట్లు ఏపీ పోలీస్ రిక్యూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.
పరీక్షల నిర్వహణకు వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను రిక్యూట్మెంట్ బోర్డు కారణంగా తెలపగా.. ఈ విషయాన్ని అభ్యర్ధులు గమనించాలని, జనవరి 11 నుంచి తిరిగి యథాతథంగా ఆయా జిల్లాల్లో ఈవెంట్స్ కు హాజరుకావాలని కోరారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ లో 6 వేల 100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో రాష్ట్ర పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది, ఇందులో 4,58,219 మంది హాజరవ్వగా.. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా.. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఫిజికల్ పరీక్షలకు 95,209 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు.
వీరికి పరీక్షలు నిర్వహించి.. పోలీసు బోర్డు నిర్దేశించిన శారీరక సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణ సాధిస్తే.. వారికి తుది పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తారు. పైగా.. ఈ పరీక్షల్లోనూ మార్కులు కేటాయిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు డిసెంబర్ 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. అభ్యర్థులకు ముందుగా తెలిపిన సమయానికి కచ్చితంగా మైదానానికి వెళ్లాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాకపోతే మైదానంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ముందే స్పష్టంగా తెలిపారు.
Also Read : ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?
ఈ కారణంగానే.. సుదూర ప్రాంతాల నుంచి కూడా కొంత మంది అభ్యర్థులు వారికి కేటాయించిన మైదానాల వద్దకు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే.. పరీక్ష వాయిదా విషయాన్ని బోర్డు తాజాగా ప్రకటించింది. అభ్యర్థులకు కూడా ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా సమాచారాన్ని అందజేసింది. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 9441450639, 9100203323 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి అధికారుల్ని సంప్రదించాలని సూచించారు.