Pawan Kalyan: అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. వైసీపీ సోషల్ మీడియా వర్కర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. పోస్టులు పెట్టిన వారు, వారి వెనక ఉన్నవారి భరతం పడుతున్నారు. చిన్నా పెద్దా అన్న తేడా లేదు. తేడాగా పోస్టులు పెట్టిన ఎవరైనా సరే బుక్ అవుతున్నారు. సజ్జల భార్గవ్, పోసాని, ఆర్జీవీ, శ్రీరెడ్డిపై ఇప్పటికే కంప్లైంట్లు వెల్లువెత్తాయి. కేసులు కూడా నమోదయ్యాయి కూడా. ఇందులో కొందరు క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జనసేన పార్టీ కార్యకర్తలకు.. తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాని ఉపయోగించుకొని తప్పుడు పోస్టులు పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ సూచనల మేరకు జనసేన శతాగ్ని టీం.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
సోషల్ మీడియాని(Social Media) బాధ్యతగా, సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలని ఆ పోస్ట్ లో సూచించారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను.. పవన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలని వెల్లడించింది. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, నాయకులు.. రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని రాసుకొచ్చింది.
Also Read: జైలుకి పంపినా బాధలేదు, కానీ కుటుంబ సభ్యుల గురించి, 150 రోజుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పీచ్
రాజకీయ నాయకులపై కానీ, సినీ నటులపై కానీ.. ఏ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తలు పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకురావాలని కోరింది. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కూడా త్వరలోనే ప్రభుత్వం తీసుకురానున్నట్టు మెన్షన్ చేసింది. జనసైనికులు క్రమశిక్షణతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నామని అంటూ పోస్ట్ చేశారు.