Kollu Ravindra vs Vasantha: మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో అధికారులు ఇచ్చిన సమాచారాన్ని చదివిన రవీంద్ర కొత్త వివాదానికి కారణమయ్యారు. శాసనమండలిలో మైనింగ్ అక్రమాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచిన రవీంద్ర మైలవరం ప్రస్తావన తెచ్చి అక్కడ కూడా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తేల్చినట్లు స్పష్టం చేశారు. దానిపై అక్కడి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభ్యంతరం చెప్పడంతో మండలిలో మాట్లాడిన అంశానికి సంబంధించి కొల్లు రవీంద్ర శాసనసభలో వివరణి ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న వైసీపీ
ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేరు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వడం లేదు. ఈ సమయంలో ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య వాగ్వాదాలు, చర్చలు చోటు చేసుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ క్రమంలో.. స్వపక్షమే విపక్షమవుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్‌లు సభలో తమ తమ అభిప్రాయాలు స్పష్టం చేసి.. స్పీకర్, మంత్రితో వాగ్వాదానికి దిగారు.
మైలవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వసంత
మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ముందు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండో సారి గెలిచి శాసనసభకు హాజరవుతున్నారు. ఆ క్రమంలో శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. మైలవరం నియోజకవర్గంలోని వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.
Also Read: అర్థసెంచరీ, కేసులపై పోసాని కీలక వ్యాఖ్యలు.. ఎలాంటి ఆధారాలు దొరకవు
మండలిలో మైలవరం అక్రమాలపై మాట్లాడిన కొల్లు రవీంద్ర
మండలిలో మంత్రి వ్యాఖ్యలతో తన హక్కులకు భంగం వాటిల్లింది. మంత్రి పొరపాటున అలా చెప్పారా? లేక అధికారులు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారా? దీనిపై మంత్రితో సభలోనే వివరణ ఇప్పించాలని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ఈ ఆసక్తికర పరిణామం జీరో అవర్‌లో చోటుచేసుకుంది. అప్పుడు సభలోనే ఉన్న మంత్రి కొల్లు స్పందిస్తూ.. పోలవరం కాలువ పరిధిలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయని.. ఆ కాలువలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, దోపిడీ వ్యవహారంపై దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించామని.. ఆ వివరాలనే మండలిలో చెప్పాను కాని.. ఎక్కడా వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
శాసనసభలో అభ్యంతరం వ్యక్తం చేసిన వసంత
దానికి కృష్ణప్రసాద్ సంతృప్తి చెందలేదు. మంత్రి పేర్కొన్న వెలగలేరు, కొత్తూరుతాడేపల్లి తన నియోజకవర్గ పరిధిలోకే వస్తాయని, తన పరువుకు భంగం వాటిల్లినందున మంత్రి సమగ్రమైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. కొల్లు మళ్లీ మాట్లాడుతూఆ గ్రావెల్ కేసులో మొత్తం 170మంది ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని, ఇందులో మీ ప్రస్తావన లేదని , అన్యథా భావించవద్దని స్పష్టం చేయడంతో కృష్ణప్రసాద్ శాంతించారు.
మంత్రి వివరణతో శాంతించిన వసంత కృష్ణప్రసాద్
శాసనసభలో గన్నవరం నియోజకవర్గ అక్రమాలపై మాట్లాడిన కొల్లు రవీంద్ర టంగ్ స్లిప్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలను ప్రస్తావిస్తూ అక్కడ అక్రమ తవ్వకాల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందని నోరు జారారు. దాంతో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సహా పలువురు మాజీ ఎమ్మెల్యే అని అరవడంతో కొల్లు రవీంద్ర తప్పు సరిదిద్దుకున్నారు. ఆ సందర్భంగా సభ నవ్వులతో నిండిపోయింది.