Chandrasekhar Reddy: ఏపీ డీఎస్సీ నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ స్కామ్‌పై జెన్ జీ ఆధ్వర్యంలో మొదలైన ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చిందన్నారు. లోకేష్ దిగిపోయి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
అక్రమాల పుట్ట డీఎస్సీ..
ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు హద్దులు దాటాయని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మదనపల్లెలో పేపర్ లీకేజ్ కారణంగానే ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వింతలు ఎన్నో జరిగాయని విమర్శించారు.
స్పోర్ట్స్ కోటా, బ్యాకప్ సర్టిఫికెట్ల పేరుతో పెను మోసం జరిగిందని.. చివరకు పేకాట ఆడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని విమర్శించారు. టెట్ రాయని వారికి ఉద్యోగాలు కేటాయించి, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో నిరుద్యోగుల గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంతో పోలికే లేదు!
జగన్ మోహన్ రెడ్డి పాలనలో 16 లక్షల మంది అభ్యర్థులు సచివాలయ పరీక్షలు రాస్తే, ఎక్కడా చిన్న సమస్య కూడా రాలేదని చంద్రశేఖర్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కేవలం మూడున్నర లక్షల మందికి సరిగ్గా డీఎస్సీ పరీక్షలు నిర్వహించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. తాము వేలెత్తి చూపిన తప్పులను సరిదిద్దే నెపంతో డేటాను ట్యాంపరింగ్ చేస్తూ, కొత్త సర్టిఫికెట్లు సృష్టించి అప్‌లోడ్ చేస్తున్నారని మండిపడ్డారు.
సీబీఐ విచారణకే మా డిమాండ్
తమ పోరాట ధాటికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని, సీబీఐ విచారణ రాకుండా తప్పించుకునేందుకే కోర్టుల్లో పెద్ద పెద్ద లాయర్లను కుదుర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడేందుకు ఎప్పుడూ వెనుకాడదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీసి తీరతామని హెచ్చరించారు.
Also Read: రాజకీయ నేతలకు సెక్యూరిటీ ఎందుకు?.. అసలు నిజం బయటపెట్టిన డీజీపీ!