AP Etikoppaka Dolls: ఏటికొప్పాక లక్క బొమ్మలు అంటే మొన్నటి వరకు తగిన గుర్తింపు లేని పరిస్థితి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హస్తకళను ప్రోత్సహించేందుకు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఈ బొమ్మలకు ప్రాచుర్యం పెరిగిందని చెప్పవచ్చు. ముచ్చటగా జీవాన్ని పోసుకున్నట్లుగా కనిపించే ఈ బొమ్మలను చూసి, యావత్ భారతావని మురిసిపోతోంది.
అంతేకాదు ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ తరపున ఈ శకటంకు స్థానం దక్కింది. వేడుకల్లో శకటం అందరినీ ఆకట్టుకుంది. అయితే మొత్తం 26 శకటాలను ప్రదర్శిస్తే, అందులో ముచ్చటగా మూడవ బహుమతి ఏటికొప్పాక లక్క బొమ్మల ఆకృతిలో ప్రదర్శించిన శకటంకు దక్కడం అభినందనీయం.
ఈ బొమ్మల విశిష్టత..
ఏపీలోని విశాఖ పట్టణం సమీపంలో ఏటికొప్పాక గ్రామం ఉంది. ఈ గ్రామం చెక్క బొమ్మల తయారీకి ప్రసిద్ది. ఈ బొమ్మలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. వీటితో పర్యావరణానికి ఏ మాత్రం హాని ఉండదు. ఈ బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉండడం విశేషం. అంకుడు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు చూడముచ్చటగా అందరినీ ఆకట్టుకుంటాయి.
హస్తకళ యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పడంలో లక్క బొమ్మలు ఎప్పుడూ ముందుంటాయి. 2017 లో ఈ బొమ్మలకు తగిన గుర్తింపు లభించగా, ఆ తర్వాత 2020లో ఏటికొప్పాక లక్క బొమ్మల గురించి పీఎం మోడీ ప్రస్తావించి యావత్ దేశానికి లక్క బొమ్మలను పరిచయం చేశారు.
ఆ తర్వాత అసలు ఏంటి లక్క బొమ్మల అంత విశిష్టత ఏమిటని అందరి దృష్టి ఈ బొమ్మలపై పడింది. కూటమి అధికారంలోకి రాగానే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడ హస్తకళలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకున్నారు. లక్క బొమ్మల తయారీకి ఉపయోగించే అంకుడు కర్ర లభ్యత కష్టంగా మారిందని కళాకారులు, పవన్ దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన పవన్.. కళాకారులకు అందుబాటులో ఉండేవిధంగా అంకుడు చెట్లను పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. అది కూడ ఏటికొప్పాక గ్రామం పరిధిలో చెట్ల పెంపకం సాగించాలని సూచించారు. పవన్ ఇచ్చిన హామీతో కళాకారులు సైతం హర్షం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత జనవరి 26న ఏపీ తరపున శకటం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. అందులో ప్రధానంగా ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ శకటం కు పరేడ్ లో పాల్గొనే అవకాశం రావడం శుభపరిణామం కాగా, 26 శకటాలలో మూడవ బహబహుమతిని దక్కించుకోవడం విశేషం. దీనితో డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు.
Also Read: Whatsapp Governance: మీ ఫోన్ లో వాట్సాప్ ఉందా.. జస్ట్ ఒక్క క్లిక్ తో ఆ సేవలు మీ ముందుకు..
బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు పవన్ ట్వీట్ లో తెలిపారు. అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని చేర్చడం జరిగిందని, ఈ సంవత్సరం ఏటికొప్పాక శకటం ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పంపించినందుకు సీఎం చంద్రబాబుకు పవన్ అభినందనలు తెలిపారు. అలాగే మూడవ బహుమతి దక్కడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఏటికొప్పాక లక్క బొమ్మలతో ఏపీ ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా చెప్పవచ్చు. ఇలా రాష్ట్ర ఖ్యాతిని నలుమూలలా చాటిన హస్తకకళాకారులను అభినందించాల్సిందే.