AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దీనితో ఎందరో ప్రభుత్వ ఉద్యోగినులకు మేలు చేకూరనుంది. ఈ ప్రకటన కోసమే ఉద్యోగులు ఎదురుచూపుల్లో ఉండగా, ఎట్టకేలకు ప్రభుత్వ ప్రకటన విడుదలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇంతకు ప్రభుత్వం చేసిన ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
ఆరు నెలలకు సెలవులు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవుల పరంగా మేలు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న 120 రోజుల మాతృత్వ సెలవులను 180 రోజులకు (దాదాపు ఆరు నెలలకు) పెంచుతూ తాజా జీవో విడుదల చేసింది. అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా, మహిళా ఉద్యోగులు తల్లి అయిన తర్వాత తమ శిశువు సంరక్షణకు మరింత సమయం కేటాయించుకోగలిగే అవకాశం కలిగింది.
ఇద్దరు పిల్లల పరిమితి ఇకలేదు
ఇందుకు తోడు, ఇప్పటి వరకూ ఈ సెలవులు కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తించేవి. అయితే తాజాగా ప్రభుత్వం ఈ నిబంధనను పూర్తిగా తొలగించింది. అంటే మూడో సంతానం కలిగినా, ఆ సమయంలో కూడా ఉద్యోగిని మాతృత్వ సెలవులు పొందవచ్చు. ఈ నిర్ణయం అనేక ఉద్యోగినుల అభ్యర్థనల నేపథ్యంలో తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహిళా ఉద్యోగుల కోసం..
ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళల శాతం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతోంది. గర్భధారణ, ప్రసవం, శిశువు సంరక్షణ వంటి సమయంలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా సెలవులు పొడిగించడము మానవతావాద నిర్ణయంగా భావించవచ్చు. దీనితో శిశువు ఆరోగ్యకర ఎదుగుదలపై దృష్టి పెట్టే అవకాశం, ప్రసవానంతర ఆరోగ్య సమస్యల నుంచి తక్కువ ఒత్తిడితో బయటపడే పరిస్థితి, కుటుంబానికి సమయం కేటాయించే అవకాశాలు పెరుగుతాయి.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాతృత్వ సెలవులను పెంచిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కేంద్ర సివిల్ సర్వీసు నియమావళిని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అన్ని శాఖల ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు వర్తించనుంది.
ఉద్యోగ భద్రత..
ఈ నిర్ణయం ద్వారా మహిళల ఉద్యోగ భద్రత మరింత బలపడనుంది. అనేక కుటుంబాల్లో మహిళలు పని నుంచి విరమించాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం, చిన్నపిల్లల బాధ్యతల వలన ఉద్యోగాన్ని వదిలేయడం వంటి పరిస్థితులకు ఇది కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది. మాతృత్వ సెలవుల పెంపు ద్వారా మహిళలకు నైతికంగా, శారీరకంగా బలం చేకూర్చే అవకాశం లభిస్తోంది. ఇది ఒక పక్క మహిళల జీవిత నాణ్యతను మెరుగుపరుస్తూనే, మరోపక్క ఉద్యోగ రంగంలో స్థిరతను కూడా కలిగించగల మార్గం.
సీఎం చంద్రబాబుకు ఇదే విషయంలో ప్రశ్న..
ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ మహిళలతో ముఖాముఖీ సంధర్భంగా ఓ మహిళ ఇదే ప్రశ్న లేవనెత్తింది. కాన్పులు సరే, సెలవులు అవసరం అంటూ అనగానే, సీఎం చంద్రబాబు త్వరలోనే ఆ శుభవార్త చెప్పనున్నట్లు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎందరో మహిళా ప్రభుత్వ ఉద్యోగినులకు మేలు చేకూరనుంది.