AP TG High Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాలలో భీకర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరో ఐదు రోజులు వర్షాభావ పరిస్థితులు తప్పవని ప్రకటన వెలువడింది. ప్రజలు జాగ్రత్త వహించకపోతే, పెను ప్రమాదం పొంచి ఉందని కూడా సూచించింది. ఇంతకు భారీ వర్షాలు ఏయే జిల్లాలపై, ఏయే రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
ఈ రాష్ట్రాలలో తస్మాత్ జాగ్రత్త..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండి ప్రకటించింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం పడే సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని ప్రకటన సారాంశం.
ఎన్ని రోజులు?
మొత్తం 5 రోజులు జాబితాలోని రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరిక ఉన్నట్లు ఐఎండి తెలిపింది. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా, మరో ఐదు రోజులు వర్షాలు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మిగిలిన రాష్ట్రాలకు కూడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు 5 రోజులు ఏకధాటిగా కురుస్తాయని ఐఎండి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణలో..
తెలంగాణలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడురోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ని జారీ చేసింది.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని.. భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పిడుగుల వాన కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట ఉరుములు, పిడుగులు, ఈదుగాలులతో వానలు పడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. అలాగే, గురు, శుక్రవారాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి తదితర జిల్లాల్లో వానలు కురుస్తాయని వివరించింది.
ఏపీలో..
మంగళవారం శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,అల్లూరి, అనకాపల్లి,పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు-భారీ వర్షాలు,50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. హోర్డింగ్స్,చెట్లు,శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.
Also Read: Jubileehills Crime: జూబ్లీహిల్స్‌లో బూతు దందా.. మరో సెక్స్ స్కాండల్ వెలుగులోకి..
అలాగే విశాఖ,కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, నెల్లూరు,కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి, వైఎస్సార్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పిడుగులు పడి 8 మంది మృతి చెందగా, ప్రజలు వర్షం సమయంలో బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది.