Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. మియాపూర్ – ఎల్బీనగర్ కారిడార్‌లో మెట్రో రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రోలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు వెంటనే రైలును నిలిపేశారు.
సాంకేతిక లోపంతో రైలు స్టేషన్‌లోనే నిలిచిపోవడంతో ప్రయాణికుల్ని లోపలికి అనుమతించకుండా మెట్రో సిబ్బంది తాత్కాలికంగా అడ్డుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికే టిక్కెట్లు తీసుకున్న ప్రయాణికులకు రీ ఫండ్ ప్రాసెస్ చేసే ప్రక్రియలో మెట్రో అధికారులు నిమగ్నమైనట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు.
ఒక్కసారిగామెట్రో రైలు నిలిచిపోవడంతో రాత్రి వేళ డ్యూటీలు ముగించుకున్న ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రయాణికులు సోషల్ మీడియాలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మెట్రో అధికారుల వర్గాల ప్రకారం, సాంకేతిక సమస్యను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని, సాధ్యమైనంత త్వరగా రైలు సేవలు పునరుద్ధరించబడతాయని పేర్కొన్నారు.
కేవలం 4 రోజుల వ్యవధిలో మెట్రో రైలు సేవలలో అంతరాయం ఏర్పడడం గమనార్హం. మొన్న 15 నిమిషాలు రైలు ద్వారాలు తెరుకుకోక పోవడంతో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వెంటనే మెట్రో అధికారులు స్పందిస్తున్నప్పటికీ ఈ తరహా సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే వర్షం సమయంలో మాత్రమే ఇటువంటి సమస్యలను మెట్రో ఎదుర్కోవడం విశేషం.