NTR Bharosa Pension Scheme: వైసీపీ కోటలపై చంద్రబాబు సర్కార్ దృష్టిపెట్టిందా? తీగలాగిన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయా? వాటిని తొలగించేందుకు సిద్ధమైందా? అవుననే అంటున్నారు అధికారులు.
ఏపీలో బోగస్ పింఛన్‌ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. వైసీపీ హయాంలో దివ్యాంగుల పింఛన్లలో భారీగా అవకతవకలు జరిగినట్టు తేలింది. పింఛన్ల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. దివ్యాంగులకు ఉండాల్సిన అర్హతలు లేకుండానే చాలామంది పింఛన్లు తీసుకున్నట్లు గుర్తించారు.
దివ్యాంగుల కోటాలో ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పింఛన్లు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో తనిఖీలు మొదలుపెట్టింది. ప్రస్తుతానికి 4 లక్షల పింఛన్లను తనిఖీ చేశారు. అందులో లక్ష మంది అనర్హులుగా తేలినట్టు తెలుస్తోంది.
అనర్హుల జాబితాలో మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎక్కువమంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు తేలిందని సమాచారం. గతంలో ఆయా వ్యక్తులు తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను పరిశీలన మొదలుపెట్టింది.
ALSO READ: పాదయాత్ర సెంటిమెంట్.. జగన్ మళ్లీ సీఎం అవుతాడా?
వినికిడి లోపం, అంధత్వం, రేచీకటి లేకపోయినా పింఛన్లు తీసుకున్నారట. చేతులు, కాళ్లు వంకర్లు లేకపోయినా సరే తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. వాళ్లంతా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. మొత్తంమీద 50 వేల మంది పైగానే తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని తేల్చారు అధికారులు.
కంటి చూపు బావున్నా 23 వేల మంది సరిగా లేనట్లు సర్టిఫికెట్ పొందారు. చెవుడు లేకున్నా 20 వేలమంది బోగస్ పింఛన్లు తీసుకుంటున్నారట. ఏపీ అంతటా 5 లక్షల మంది దివ్యాంగుల కేటగిరిలో ఉన్నవారికి ధ్రువీకరణ పత్రాల కోసం నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. పత్రాలతో తనిఖీలకు రావాలని నోటీసుల్లోప్రస్తావించారు.
5 లక్షల మందిలో 4.76 లక్షల మంది తనిఖీలకు వచ్చారని, మిగిలిన వారికి మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆలోచన చేస్తోంది. అప్పటికీ రాకపోతే చర్యలు తప్పవని చెబుతున్నారు. దివ్యాంగుల కేటగిరిలో పింఛన్‌లు పొందుతున్నవారిలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది. ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే పులివెందుల నియోజకవర్గంలో భారీగా బోగస్ పింఛన్లు ఉన్నాయి. దాని తర్వాత కాకినాడ సిటీ 19 బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేలాయి. చాలా నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇలాంటి పింఛన్లు గుర్తించారు. కాకినాడ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి 1,300 వరకు బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేలింది.
88 నియోజకవర్గాల్లో దాదాపు 970 మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు సమాచారం. 59 నియోజకవర్గాల్లో 500 మధ్య బోగస్ పింఛన్లు ఉన్నాయి. అత్యల్పంగా విశాఖపట్నం దక్షిణం-39, తాడికొండ-55, విశాఖ ఉత్తరం-57 బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేలింది.