AP Politics: మరోసారి మాజీ సీఎం జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. మీతో కలిసి కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయంటూ యువజన విభాగ సమావేశంలో క్లారిటీ ఇచ్చి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి పాదయాత్రతోనే అధికారంలో రావాలని భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటన ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
మరోసారి పాదయాత్ర అంటున్న మాజీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది..కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తానని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులలో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు
రానున్న ఎన్నికల ముందు రాష్ట్రంలో మరో పాదయాత్ర
ఏపీలో పాదయాత్రల ట్రేండ్‌ను జగన్ కొనసాగించనున్నారు. ఆ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుకు ఏపీలో మరో పాదయాత్ర స్టార్ట్ కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్‌కు పాదయాత్ర కొత్త ఏమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతోందంట
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా జగన్ పాదయాత్ర
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా జగన్ పాదయాత్ర సాగింది. 2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వరకూ ఏకంగా పదిహేను నెలల పాటు… మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర ఏపీ అంతా తిరిగారు. ఆ పాదయాత్ర ఫలితంగానే 2019 ఎన్నికల్లో 151 వైసీపీకి సీట్లను అందించింది. ప్రజలతో మమేకమవడం…ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకోవడంతోనే నవరత్నాలతో ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్లు వైసీపీ అధినేత జగన్ పలు సందర్భాలు చెప్పారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబుకి కలిసివచ్చిన పాదయాత్ర
అంతకు ముందు 2014 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఉభయరాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఆయన రెండు కళ్ల సిద్దాంతం వినిపించారు. దాంతో రెండు రాష్ట్రాల్లో టీడీపీ భూస్థాపితం అవ్వబోతుందని ప్రత్యర్థులు తెగ ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నవ్వాంధ్రలో అధికారంలోకి రావడానికి, తెలంగాణలోనూ 12 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు దక్కించుకోవడానికి ఆ పాదయాత్రే కూడా ఒక కారణమైందన్న అభిప్రాయం ఉంది. 2004 ఎన్నికల ముందు కూడా దివంగత వైఎస్ ఆ పాదయాత్రతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలిగారు
పాదయాత్రల సెంటిమెంట్‌తోనే జగన్ ప్రకటన..
ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇలాంటి సమయంలోనే జగన్ పాదయాత్ర గురించి ప్రకటన చేయడం పాదయాత్రల సెంటిమెంట్‌తోనే అన్న చర్చ జరుగుతోంది. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహం. జమిలీ ఎన్నికలు వస్తాయంటున్న జగన్ ఆ లెక్కలతోనే … 2027 చివరిలో, లేకపోతే అంతకంటే ముందే పాదయాత్ర స్టార్ట్ చేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తానంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో రెండు రోజులు నిద్ర చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆ పాదయాత్ర షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించలేదు. ఈ సారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో అయన వెల్లడించలేదు.
ఈ సారి ఖచ్చితంగా జనంలోకి వస్తారంటున్న నేతలు
అయితే ఈ సారి ఖచ్చితంగా జగన్ జనంలోకి వస్తారంటున్న వైసీపీ నేతలు ప్రతి నెలా రెండు జిల్లాల్లో ఆయన పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. మరో ఏడాది పూర్తయితే కూటమి ప్రభుత్వంపై పూర్తి స్పష్టత వస్తుందనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారట. ఆ టైమ్‌లో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ కార్యక్రమాన్ని రూపొందించుకోవచ్చనే ప్లాన్‌లో వైపీపీ ఉందంటున్నారు. ఏపీలో పాదయాత్రలు ఎపుడూ సక్సెస్ అవుతూనే వచ్చాయి. పాదయాత్ర చేసిన వారికి అధికారం దక్కింది. అది వైఎస్, చంద్రబాబు, జగన్, లోకేష్ ఇలా అందరూ పాదయాత్ర చేసి సక్సెస్ అంతుకున్న వరే. అందుకే జగన్ మరోసారి పాదయాత్ర అంటున్నారంట. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తొందో చూడాలి. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగానే జగన్ పాదయాత్రను ప్రకటించడం చర్చినీయంశంగా మారింది.
జగన్ ప్రకటనతో పార్టీ నేతలు యాక్టివ్ అవుతారా?
ఇప్పుడే పాదయాత్ర ప్రకటించడం ద్వారా నేతల్లోను, పార్టీ కేడర్‌లో జోష్ నింపడానికే అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ప్రజల్లోకి వెళ్లుతోంది వైసీపీ. ఇలాంటి తరుణంలో జగన్ పాదయాత్ర ప్రకటించడంతో పార్టీ నేతలు మరింత యాక్టివ్‌గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అదలా ఉంటే జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇష్టాను సారంగా పర్యటనలు చేస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయ్ బ్యాచ్‌ను, రౌడీలను పరామర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు.
Also Read: ట్రంప్ మస్క్ డిష్యుం డిష్యుం..! ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటంటే..
మరిలాంటి పరిస్థితుల్లో జగన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది. ఈ యాత్రలైనా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి కొనసాగుతాయా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తమ్మీద ఈ సారి పాదయాత్రలో ఎలాంటి వ్యూహాంతో జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు… పార్టీని పాదయాత్ర ఏమేరకు అధికారంలోకి తీసుకువస్తుందనేది చూడాలి.
Story By Apparao, Bigtv