ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకి రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్ట్ 15నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించబోతోంది. ఏడాదిగా ఈ పథకం అమలు విషయంలో తర్జనభర్జన పడుతున్నా ఎట్టకేలకు సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ఇటీవలే తల్లికి వందనం కూడా హడావిడి లేకుండా అమలులోకి వచ్చింది. లబ్ధిదారులంతా ఫుల్ ఖుషీ. పనిలో పనిగా నెల రోజుల వ్యవధిలనే మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ పథకం అమలులోకి వస్తే ఆటోడ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది జరుగుతుందనే అనుమానం కూడా ఉంది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మహిళలతోపాటు, ఆటో డ్రైవర్లకు కూడా తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన వెంటనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తాం..#సుపరిపాలనలోతొలిఅడుగు#FirstStepRebuildingAP#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/F9jI4RqhOu
— Telugu Desam Party (@JaiTDP) June 24, 2025
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకం అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అమలు విషయంలో ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పథకం అమలైన కొత్తల్లో ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతామని భయపడినా అలాంటి ఇబ్బందేమీ జరగలేదు. ఇక ఏపీ విషయానికొద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయలేకపోయింది. తెలంగాణలో పథకం అమలు తీరుని, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరుని పరిశీలించాక విమర్శలను కాచుకోడానికి ప్రభుత్వం తర్జనభర్జన పడింది. చివరకు 2025 ఆగస్ట్ 15నుంచి మహిళలకు ఉచిత రవాణా పథకం పట్టాలెక్కిస్తామన్నారు. హామీ ఇచ్చినట్టుగానే దానికోసం కసరత్తు ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అయితే ఆటో డ్రైవర్ల విషయంలో కూడా ప్రభుత్వం ముందుగానే ఆలోచించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. తాజాగా టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి ఈ పథకం అమలుపై ఓ అప్డేట్ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన వెంటనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఉచిత పథకాలు సమాజంలో కొన్ని కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా అమలు చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ పథకాల అమలులో మిగతా వారికి అన్యాయం జరగడం అంటూ ఏమీ ఉండదు. లబ్ధిదారులు సంతోషంగా ఉంటారు, లబ్ధిదారులు కాలేనివారు తమకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. కానీ మహిళలకు ఉచిత రవాణా పథకం మాత్రం అలా కాదు. పరోక్షంగా ఇది ఆటో డ్రైవర్ల ఉపాధితో ముడిపడి ఉంది. అప్పటి వరకు ఆటోలను ఆశ్రయిస్తున్న మహిళా ప్రయాణికులు సడన్ గా ఆర్టీసీవైపు మొగ్గుచూపుతారు. దీంతో ఆటో డ్రైవర్లకు రోజువారీ సంపాదన తగ్గే అవకాశముంది. కానీ ఆమేర ఆటోలు ఎక్కే పురుషుల సంఖ్య పెరిగితే గిట్టుబాటు అయ్యే అవకాశం కూడా ఉంది. అత్యవసరం ఉన్నవారు ఆర్టీసీ బస్సులకోసం వేచి చూడకుండా ఆటోలను ఎక్కుతుంటారు. ఇవన్నీ ప్రత్యామ్నాయాలు. అయినా కూడా ఆటో డ్రైవర్ల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం విశేషం. అంటే ఈ పథకం ప్రత్యక్షంగా, మహిళలకు, పరోక్షంగా ఆటో డ్రైవర్లకు కూడా మేలు చేస్తుందనమాట. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందేది. కూటమి హయాంలో అది ఆగిపోయిందనే అపవాదు ఉంది. దాన్ని ఇలా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడటం ఆసక్తికరంగా మారింది.