AP Mid Day Meal: ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే విద్యా వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరం నుండి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నిర్ణయం ఏమిటి? విద్యార్థులకు ఏమేర మేలు చేకూరుతుందో తెలుసుకుందాం.
ఏపీలో ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేస్తానంటూ మారాం చేసే రోజులు రాబోతున్నాయి. ఔను ఇది నిజం.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెనూలో మార్పులు చేసిన ప్రభుత్వం, సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎందరో విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతోంది. బడి బయట ఉన్న చిన్నారులు, బడిలో ఉండాలన్న లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఇంటర్ విద్యార్థులకు కూడా పథకం అమలు చేసింది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ పటిష్టతకు దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఏపీ పాఠశాల విద్యా శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చి రాగానే పెద్ద పండుగ పేరుతో అన్ని పాఠశాలల్లో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానం చేరువ చేయాలన్న సంకల్పంతో ఏఐ ఆధారిత తరగతులను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారాంతంలో ప్రతి విద్యార్థి ఆటపాటల మధ్య మానసిక ఉల్లాసాన్ని పొందేలా ఆటలు ఆడించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుండి పలు కొత్త పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైందని చెప్పవచ్చు.
ఇప్పటికే తల్లికి వందనం కార్యక్రమం అమలుపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000ల ఆర్థిక సాయం అందించేందుకు మే నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం’ ద్వారా 35.69 లక్షల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు అందజేసేందుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం వినియోగించాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో లోకేష్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది.
Also Read: AP Govt: ఏపీలో ఉచిత విద్యుత్.. ఇకపై వారికి కూడా వర్తింపు..
దీనిని బట్టి రానున్న విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందనుంది. దీనితో రుచికరమైన భోజనం విద్యార్థులకు అందడమే కాకుండా పౌష్టికాహారం అందించినట్లుగా భావించవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.