Good News to 10th Students: పదో తరగతి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్లోడ్ విషయంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు పొందే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం, మరో శుభవార్తను సైతం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
ఏపీలో ఈనెల 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వము ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటల నుండి 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసిన ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
10వ తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్ల డౌన్లోడ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని సైతం కల్పించింది. అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆయా పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు సైతం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా చదువుతున్నారని చెప్పవచ్చు.
అయితే మార్చి 17వ తేదీన ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కేవలం పదవ తరగతి పరీక్ష హాల్ టికెట్ ఉంటే చాలు, ఈ బస్సులలో ఉచితంగా రవాణా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పబ్లిక్ హాలిడే సమయాల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం కు ప్రభుత్వం సూచించింది. దీనితో రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనుండగా, వారికి ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పవచ్చు.
Also Read: Womens Railway Stations: తెలుగు రాష్ట్రాలలో మహిళలు నడుపుతున్న.. ఈ రైల్వేస్టేషన్స్ గురించి తెలుసా?
పరీక్షా కేంద్రాలకు సుదూర గ్రామలలో ఉన్న విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి సకాలంలో పరీక్షా కేంద్రం వద్దకు చేరేందుకు ఈ ప్రకటన దోహద పడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రభుత్వ ప్రకటనపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి లోకేష్ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నారని చెప్పవచ్చు. పది విద్యార్థుల పరీక్షల టైమ్ టేబుల్ తయారీలోనూ, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వారికి మరింత సమయం ఇచ్చేలా పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారు చేశారు. దీనితో పరీక్షలపై విద్యార్థులకు ఉన్న మానసిక ఆందోళన తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వ ఆలోచన. మొత్తం మీద మీరు పది విద్యార్థులైతే, జస్ట్ అలా హాల్ టికెట్ చూయించి, పరీక్షల కాలంలో ఉచిత రవాణా సదుపాయం పొందండి.