అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల అమెరికన్ ఉత్పత్తల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆపిల్ ఐఫోన్లు, మాక్ బుక్ లు, ల్యాప్ టాప్ లతో సహా ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా వస్తువులపై అధిక పన్నులు విధించే దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిగా సుంకాలను ప్రకటించారు. రీసెంట్ గా అమెరికా కాంగ్రెస్ సమావేశం మాట్లాడిన ట్రంప్.. భారతదేశంతో సహా అనేక దేశాలు అన్యాయంగా సుంకాలు విధుస్తున్నాయన్నారు. ప్రతిగా ఆ దేశాలపైనా ట్యాక్సుల మోత మోగిస్తామన్నారు.
ఏప్రిల్ 2 నుంచి అమెరికా ట్యాక్స్ లు అమలు
అమెరికా నుంచి ఆటోమోటివ్ దిగుమతులపై భారతదేశం 100 శాతం కంటే ఎక్కువ ట్యాక్సులను విధిస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి భారత్ విషయంలోనూ సుంకాలు అమలులోకి వస్తాయన్నారు. తమపై ఆయా దేశాలు ఎంత పన్ను విధిస్తున్నాయో తాము కూడా అంతే పన్ను విధిస్తామని వెల్లడించారు. యుఎస్ కాంగ్రెస్‌లో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఆయా నివేదికల ప్రకారం, కొత్త సుంకాలు ఎలక్ట్రానిక్స్ తో సహా అన్ని శ్రేణుల ఉత్పత్తులను ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో కొనసాగుతున్న ఐఫోన్ల తయారీ
ఇటీవలి సంవత్సరాలలో ఐఫోన్ లు, ఇతర పరికరాల స్థానిక ఉత్పత్తిని క్రమంగా పెంచుతున్న ఆపిల్ వంటి బ్రాండ్‌లకు భారతదేశం కీలకమైన తయారీ కేంద్రంగా మారింది. ఆపిల్ 2017 నుంచి దేశంలో ఐఫోన్లను తయారు చేస్తోంది. కానీ, సాధారణంగా బేస్ వేరియంట్లు మాత్రమే మన దేశంలో తయారు చేయబడ్డాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, ఆపిల్ ఇక్కడ తయారు చేసే మోడళ్ల శ్రేణిని నెమ్మదిగా విస్తరిస్తోంది. ఆపిల్ ఇప్పుడు మన దేశంలో ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడళ్లను కూడా తయారు చేస్తోంది. నిజానికి, ఐఫోన్ 16ఈ కోసం, ఆపిల్ భారత్ లో స్థానిక మార్కెట్ కోసం మాత్రమే కాకుండా ఎగుమతుల కోసం కూడా అసెంబుల్ చేస్తుందని తెలిపింది.
ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం
ఇక తాజాగా అమెరికా కొత్త పన్నుల కారణంగా US సుంకాల కారణంగా, భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను పెరిగే అవకాశం ఉంది. ఇది దేశ తయారీ వ్యవస్థపై ఆధారపడే కంపెనీలకు మొత్తం ఖర్చులను పెంచే అవకాశం ఉంది. భారీ పన్నులు విధించినట్లయితే, బ్రాండ్లు లాభాల మార్జిన్లను కొనసాగించడానికి ధరలను పెంచవలసి వస్తుంది. ఫలితంగా భారతదేశంలోనే కాకుండా విదేశాల మార్కెట్లలో కూడా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ట్యాక్స్ లు భారీగా పెంచిన ట్రంప్
చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఆపిల్ కొత్తగా 10 శాతం ట్యాక్సులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో USలో ఆపిల్ కంపెనీ ఐఫోన్లు, ఐప్యాడ్ లు, మాక్ బుక్ ల ధరలను పెంచుతుంది. కెనడియన్, మెక్సికన్ దిగుమతులపై కొత్తగా 25 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక రోజు తర్వాత ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించారు. మరోవైపు, చైనా వస్తువులకు సంబంధించిన దిగుమతి సుంకాలను 20 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు.
Read Also: ఆమె జుట్టు అలా ఉంది.. ట్రంప్ అంకుల్ ఏమిటా కామెంట్స్?