AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో.. మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియలో భాగంగా.. విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.62.86 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేయడానికి కోర్టు అనుమతినిచ్చింది. దర్యాప్తు సంస్థలు కోర్టును ఆశ్రయించి, నిందితులు అక్రమ లావాదేవీలు జరిపారని, వారి ఆస్తులు నకిలీ లాభాలతో కూడినవని వాదించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
నోటీసులు జారీకి ఆదేశం
కోర్టు ఈ కేసులో నిందితులకు ఆగస్టు 1 లోపు నోటీసులు జారీ చేయాలని.. సంబంధిత దర్యాప్తు అధికారిని ఆదేశించింది. జప్తు ప్రక్రియ మొదలుపెట్టే ముందు నోటీసులు ఇచ్చి, వారి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
పట్టుబడిన నగదు, బ్యాంకు ఖాతాల వివరాలు
ఈ కేసులో ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో.. చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ.8 కోట్ల నగదు ప్రధాన ఆధారంగా మారింది. ఈ నగదును దర్యాప్తు సంస్థలు అనుమానాస్పదంగా గుర్తించాయి. విచారణలో భాగంగా దీనికి సంబంధించి మరిన్ని లింకులు బయటపడ్డాయి. దాంతో పాటు, డిస్టిలరీలు, నిందితుల పేరపై ఉన్న అనుమానాస్పద ఆస్తుల వివరాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.
మొత్తం 3 బ్యాంకు ఖాతాల్లోని రూ.32.86 కోట్ల నగదును అటాచ్ చేశారు. ఇందులో అదాన్ డిస్టిలరీస్‌కు చెందిన రూ.20 కోట్ల నగదు ఉన్న ఖాతా, లీలా డిస్టిలరీకి సంబంధించిన రూ.2.85 కోట్ల నగదు ఉన్న ఖాతా ఉన్నాయి. వీటిని సీజ్ చేయడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఈ డిస్టిలరీలు ఈ కేసులో ప్రధాన సంస్థలుగా ఉన్నాయి.
స్కామ్‌పై దర్యాప్తు వేగవంతం
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురిని విచారించిన దర్యాప్తు సంస్థలు, ఈ కేసును తీవ్రంగా తీసుకున్నాయి. రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను.. కొంతవరకూ ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసులో నిధుల వినియోగం, బోగస్ లావాదేవీలు, ఎన్నికల వేళ డబ్బుల చలామణి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
నిందితుల జాబితాలో కీలక వ్యక్తులు
ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి జాబితాలో కొంతమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా డిస్టిలరీల యజమానులు, మధ్యవర్తులు, ఇతర ఆర్థిక భాగస్వామ్యులు ఈ కేసులో కీలకంగా ఉన్నారు. వారి మీదున్న ఆరోపణలను ఆధారాలతో.. న్యాయస్థానానికి సమర్పించిన దర్యాప్తు సంస్థలు, ప్రస్తుతం ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు వేగవంతం
మరోవైపు ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇవాళ విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. మరోసారి విజయసాయి రెడ్డిని మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
ఇవాళ విచారణకు హాజరు కానున్న విజయసాయి రెడ్డి
ఇప్పటికే ఈ కేసులో విజయసాయి రెడ్డి ఏ5 నిందితుడిగా చేర్చారు. విజయసాయి రెడ్డి మాత్రం తాను నిందితుడిని కాదని, కేవలం ఒక విజిల్‌బ్లోయర్‌నంటూ వాదిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. అప్పుడే రాజ్ కేసిరెడ్డి వ్యవహారం బయటకి వచ్చింది. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన రెండు సమావేశాల్లో కూడా తాను పాల్గొన్నట్లు అప్పటి విచారణలో విజయసాయిరెడ్డి అంగీకరించారు. రెండో విడత విచారణలో విజయిసాయిరెడ్డి ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారింది.