AP Liquor scam: ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరుగుతోంది? విచారణ లోతుగా జరిగిన కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? లిక్కర్ స్కామ్‌లోకి బంగారం ఎలా ఎంటరైంది? వెయ్యి కిలోల బంగారాన్ని ఏం చేశారు? ముంబై, హైదరాబాద్‌లో అత్యధికంగా కొనుగోలు చేశారా? ఆ బంగారం అంతా దుబాయ్‌కి వెళ్లిందా? లిక్కర్ కుంభకోణం మరో కేజీఎఫ్ కానుందా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు.
కేజీఎఫ్ సినిమాలో ఓ సీన్ వుంది. గనుల్లో వెలికి తీసిన బంగారాన్ని దుబాయ్‌కి పంపి అక్కడి నుంచి మళ్లీ దిగుమతి చేసుకోవడం. దీన్ని పసిగట్టిన హీరో, తన దృష్టంతా కేజీఎఫ్ గనులపై పెడతాడు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో అదే సీన్ రిపీట్ అవుతోంది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మద్యం వ్యవహారాన్ని చక్కబెట్టిన రాజ్ కసిరెడ్డి టీమ్ గురించి లేటెస్ట్ అంశాలు బయటకు వస్తున్నాయి. డిస్టలరీలు, మద్యం కంపెనీలు భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తొలుత 400 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు 1000 కేజీలకు చేరిందట.
ముంబైలో బులియన మార్కెట్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి దాదాపు 200 కోట్ల బంగారం కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. మిగతాది తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన బంగారం షాపుల యజమానుల వద్ద కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కొనుగోలు చేసిన బంగారాన్ని డిస్టలరీలు, మద్యం కంపెనీల అధినేతలు కసిరెడ్డి టీమ్‌కి అందజేసేవారట.
ALSO READ: ఏపీలో 2260 స్పెషల్ టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్, కోర్టుల్లో కూడా
వారి నుంచి వివిధ విదేశాలకు బంగారం వెళ్లిందని సమాచారం. ఆ బంగారం కాస్త డబ్బుగా మారిన తర్వాత తెలంగాణలో సినిమాలు, రియల్ ఎస్టేట్, హాస్పటల్స్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ వ్యవహారం ఉన్నట్లు తేలడంతో ఈడీ ఎంటరైంది. ఆ బంగారంపై ఈడీ ఫోకస్ చేయనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లిక్కర్ స్కామ్‌పై దృష్టి పెట్టలేదు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఫైళ్లు మాయమవ్వడం మొదలయ్యాయి. అనుమానం వచ్చిన ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం కుంభకోణం వెనుక తతంగం నడచినట్టు భావించారు.
మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో ఎక్కడ చూసినా బంగారం కోనుగోలు చేసిన రసీదులు అధికారులకు కనిపించాయి. బిల్లులు పరిశీలిస్తే మినిమం 10 కేజీపైనే బంగారం కొనుగోలు చేసినట్టు కనిపించాయి. అదంతా పరిశీలిస్తే దాదాపు 1000 కేజీల పైనే బంగారం కొనుగోలు చేసినట్టు తేలింది.
కుంభకోణం సమయంలో తులం బంగారం ధర 50 నుంచి 70 వేలు మధ్యలో పలికేది. ఇప్పుడు రేటు గురించి చెప్పనక్కర్లేదు. ముడుపుల వ్యవహారంపై పెద్దగా అధికారులు చూడలేదు. లిక్కర్ అమ్మకాలపై విచారణ చేస్తుండగా, బంగారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి లిక్కర్ కేసులో తీగలాగితే డొంక అంతా కదులుతోంది.