AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరగబోతుంది. నేడు సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరుకావడం అనివార్యమైంది. ఈరోజు ఉదయం 11 గంటలలోపు ఆయన విచారణకు హాజరవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
లిక్కర్ స్కామ్‌లో ఏ4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా… మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ సంఖ్య 12కు చేరుకోనుంది. వైసీపీ హయాంలో స్కామ్‌కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అనే ఆరోపణలు ఉన్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసు క్లైమాక్స్‌కి చేరింది. ఈ కేసుకు సంబంధించి నేడు విజయవాడ ACB కోర్టులో చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది సిట్. ఈ కేసులో ఇప్పటి వరకు 200 మందిని విచారించిన సిట్ అధికారులు.. కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సిట్.. మరి కొంతమందిని విచారిస్తోంది. మొత్తం 3 వేల 500 కోట్ల స్కాం జరిగినట్లు గుర్తించిన సిట్.. కీలక ఆధారాలతో చార్జ్‌షీట్ రెడీ చేసింది. 41 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు సిట్ అధికారులు.
ఇక.. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం లేకపోయినా.. రాజకీయ కక్షతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. అక్కడే నిరాశే మిగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. అరెస్ట్ చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని.. సిట్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని ధర్మాసనం అడిగింది. లొంగిపోవడానికి టైమ్ ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఇప్పటికే.. ముందస్తు బెయిలు కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడా.. ఎదురుదెబ్బే తగిలింది.
Also Read: నేడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. కోర్టులో ఆయన అరెస్ట్ కోసం.. మెమో దాఖలు చేశారు. ఇప్పటికే.. మిథున్ రెడ్డి మాజీ గన్‌మెన్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. గత ఎన్నికల టైమ్‌లో.. మిథున్ రెడ్డికి గన్‌మెన్లుగా పనిచేసిన ఇద్దరిని రహస్య ప్రదేశంలో విచారించి.. వారి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేయడంతో.. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఎల్వోసీ ఇచ్చారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం.. అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఆచూకీని కనిపెట్టేందుకు.. సిట్ బృందాలను ఏర్పాటు చేసింది. ఆయన ఆచూకీ తెలియగానే.. సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.