AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు సీరియల్ మారిదిగా సాగుతోందా? సిట్ ఛార్జిషీటు వేసిన ప్రతీసారి కొత్త కొత్త పేర్లు బయటపెడుతుందా? రేపో మాపో వారికి పిలుపు వస్తుందా? వారిని విచారిస్తుందా? లేక అరెస్టు చేస్తుందా? మరో ఏడాది పాటు విచారణ కొనసాగుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో లిక్కర్ కేసులో వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు ఈ కేసులో కంపెనీలు, నిధులు తరలింపు వ్యవహారాలపై దృష్టి పెట్టింది. లిక్కర్ ముడుపులు పార్టీలో ఏయే నేతలకు వెళ్లాయి? గడిచిన ఎన్నికల్లో ఎవరు ఉపయోగించారు? అనేదానిపై ఫోకస్ చేసింది. లేటెస్ట్‌గా సిట్ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జిషీటులో దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి పేరు ప్రస్తావించింది.
గత ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం ముడుపులను ఆయనకు అందజేసినట్లు సిట్ తేల్చింది. గతేడాది మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగింది. దానికి కొద్దిరోజుల ముందు ఏప్రిల్ 21, 22న చెవిరెడ్డి, బాలాజీకుమార్‌లు ప్రకాశం జిల్లా పొదిలిలో ఉన్నట్లు పేర్కొంది. ఆ సమయంలో శివప్రసాద్‌రెడ్డితో బాలాజీకుమార్ పలుమార్లు ఫోన్ చేశారని వెల్లడించింది.
ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో చాలామంది వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం మద్యం ముడుపులు వెళ్లాయి. ఆ సొమ్ము చేరవేత చెవిరెడ్డి నేతృత్వంలో సాగిందని ఆధారాలతో బయటపెట్టింది. ఈ నేపథ్యంలో శివప్రసాద్‌రెడ్డికి మద్యం ముడుపులు అందించినట్లు సిట్ గుర్తించింది.
ALSO READ: అవినాష్ మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ
ప్రస్తుతం శివప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ రేసులో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియగానే ఆయా నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారం తమకు మెడకు ఎక్కడ చుట్టు కుంటుందోనని నేతలు హడలిపోతున్నారు.
ఈ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌తో ఈ కేసు ఫైనల్‌కు చేరుకుందని చాలామంది నేతలు భావించారు. చివరకు తాడేపల్లికి ఆ సెగ తగలనుందని లెక్కలు వేశారు. ఈలోగా జగన్ బంధువు నర్రెడ్డి సునీల్‌రెడ్డి కంపెనీలపై దాడులు చేసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారం జరుగుతుండగానే ఎన్నికల కోసం ముడుపులు అందుకున్న నేతలపై దృష్టి పెట్టింది సిట్.