AP DSC-2025: ఏపీలో మెగా డీఎస్సీ-2025కి సంబంధించి ఓ అంకం పూర్తి అయ్యింది. దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని పోస్టులకు కలిపి దాదాపు 5,67,417 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లు మే 30న విడుదల కానున్నాయి. హాల్ టికెట్లు విడుదలకు సంబంధించి తెర వెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం జారీ చేసిన డీఎస్సీ 2025 నోటిఫికేషన్ దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. చివరిరోజు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీకి దాదాపు 3 లక్షల 53 వేల 598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఓవరాల్‌గా 5.67 దరఖాస్తులు వచ్చినట్టు ప్రకటించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.
ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. మే 15తో ఆ గడువు కాస్త ముగిసింది. పలువురు అభ్యర్థులు వారికున్న అర్హతలకు బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు. వేరే రాష్ట్రాలకు చెందినవారు ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు. ఈ పోస్టుల కోసం అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి దాదాపు 40 వేల మంది దరఖాస్తు చేశారు.
ALSO READ: ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ భేటీ, లిక్కర్ కేసులో తదుపరి అరెస్టులపై చర్చించే ఛాన్స్?
కడప జిల్లా నుంచి అత్యల్పంగా 15,812 మంది అప్లై చేసుకున్నారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 30 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి వారి లాగిన్ వివరాలతో పొందే అవకాశం ఉంది.
మే 20 నుంచి మాక్ టెస్టులు రాసే ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమై, జులై 6 వరకు జరుగుతాయి. సీబీటీ విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేయనుంది విద్యాశాఖ.
ప్రాథమిక కీల విడుదల తర్వాత వారం పాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. గడువు ముగిసిన తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. వారం రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదల కానుంది.