Amaravati: ఏపీలో వరుస తుఫాన్లు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆలోచనలో పడింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్. మురసు తుఫాన్ నేపథ్యంలో రూరల్ ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది వెళ్లడం కష్టంగా ఉంటుందని భావించింది. దీనిపై వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదిక తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో గురువారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఉత్కంఠకు తెర పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అంటే నవంబర్ 5న పోలింగ్ యథావిధిగా జరుగుతుంది. ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీ ఎన్నికల కమిషన్ అనిల్ చంద్ర. బుధవారం దీనిపై తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
మురసు తుపాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలను భారీగా వర్షాలు కురిశాయి. దీని కారణంగా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగింది. సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేక లెక్కింపు ఆలస్యమైంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా వేయాలని ఎస్ఈసీకి విజ్ఞప్తులు చేశారు. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
బుధవారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకున్నాయి. వాతావరణ శాఖ సమాచారంతో పోలింగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం ఉదయం వివిధ జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎస్ఈసీ. అంతా ఓకేనని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు ఇబ్బందులు లేవని మెజారిటీ కలెక్టర్లు చెప్పారు. నవంబర్ 5న పోలింగ్, 7న ఓట్ల లెక్కింపు యథావిధిగా జరగనుంది.
ALSO READ: తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!
ఎన్నికల సామాగ్రి రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదంతో వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ సైకాంత్ వర్మ తెలిపారు. పైన చెప్పిన మూడు మండలాలకు ఎన్నికల సామాగ్రిని తరలించడం సాధ్యం కాలేదని, అక్కడ పోలింగ్ వాయిదా వేశారని అన్నారు.
గురువారం జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దాదాపు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2.52 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారు. సీసీటీవీ, వీడియోగ్రఫీతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు ఎస్ఈసీ.